AP: వారంలోపు నామినేటెడ్ పదవుల భర్తీ

నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. మరో వారంలో నామినేటెడ్ పదవులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి జాబితా కంటే రెండు మూడు రెట్ల పదవులు ఎక్కువగా ఉంటాయని సమాచారం. మొత్తం 50 BC కార్పొరేషన్‌లు ఉండగా.. 35 వరకు భర్తీ చేయాలని భావిస్తున్నారట. వీటిలో జనసేన, బీజేపీ నేతలకు కూడా కొన్ని కేటాయించాలని నిర్ణయించారని తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వారం రోజుల్లో మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయనుంది. మొదటి జాబితాలో ప్రకటించిన పోస్టుల కంటే రెండో జాబితాలో రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీలో 50 వరకు కులాల కార్పొరేషన్లు ఉండగా, అందులో 30-35 వరకు పదవులు ఈ విడతలో భర్తీ చేస్తారని తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని ఇతర కార్పొరేషన్ పదవుల నియామకం చేపడతారు. కార్పొరేషన్ పదవుల్లో టీడీపీతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీలు జనసేన, బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తారు. దీనిపై బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు ఐదారు గంటలు కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 11నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలోపు ప్రకటించే అవకాశముంది. పార్టీ కోసం కష్టపడినవారికి తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయాలకు వందల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఒక్కో కార్పొరేషన్‌కు 12మంది సభ్యులను నియమించుకునే అవకాశముంది.
ఇంకా ఎక్కువ పోస్టులు
గతంలో ప్రకటించిన దానికంటే పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పదవుల ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి లిస్టులో ఇచ్చిన దాని కంటే రెండు మూడు రెట్లు అధికంగా రెండో జాబితా ఉంటుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు లోతుగా కసరత్తు చేస్తున్నారు.
కొన్ని కులాలకు ప్రత్యేకంగా
కూటమి సర్కార్‌లో జనసేన, బీజేపీ భాగసామ్యంగా ఉండటంతో ఆ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు కేటాయించాల్సి రావడంతో ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతోందని భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కులాలకు సంబంధించి అదనంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే స్వర్ణకార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. బీసీలకు పదవులివ్వడమే కాకుండా ఆయా కార్పొరేషన్లకు నిధులిచ్చి ఆయా కులాలవారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. కూటమి నేతలతో చర్చించి పదవుల పందేరం చేయనున్నారు. ఇప్పటివరకు భర్తీచేసిన నామినేటెడ్ పదవుల విషయంలో అసంతృప్తులు, విభేదాలు రానందున ఇదే పద్ధతిలో పంపిణీ జరగాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి సేవలందించిన వారిని గుర్తుపెట్టుకుని వారి శ్రమకు తగ్గ ఫలితం అందేలా నిర్ణయం తీసుకుంటారు. ఏ పదవులకు ఎవరు సమర్థులో పరిశీలించి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీలోని అన్ని స్థాయి నేతలతో మాట్లాడి, జాబితాను ప్రాథమికంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. పదవులిచ్చిన తర్వాత ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఆయా నేతల వ్యక్తిగత వివరాలు కూడా సేకరించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com