YCP: వైసీపీ నేతల గుండెల్లో గుబులు

YCP: వైసీపీ నేతల గుండెల్లో గుబులు
నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై తుది కసరత్తు.. ఇవాళ మరోసారి సమావేశం కానున్న జగన్‌...

వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు ప్రాంతీయ సమన్వయకర్తలతో చర్చించిన ఆయన ఇవాళ మరోసారి సమావేశమై నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులను ఖరారు చేయనున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో పాటుస మన్వయకర్తలుగా నియమించాలనుకున్న నేతలను తన క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ చర్చల తర్వాత తొలివిడత జాబితాను ఖరారు చేసి జనవరి 2న ప్రకటించనున్నారు. తొలి విడతలో ప్రకటించబోయే జాబితాలో ప్రధానంగా...ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 9, అనంతపురం 7, కృష్ణా 6, ప్రకాశం, విశాఖ జిల్లాలో నాలుగేసి, పశ్చిమ గోదావరి..., కర్నూలులో మూడేసి స్థానాలు, శ్రీకాకుళంలో రెండు నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం.


మార్పులు తథ్యమంటున్న స్థానాల్లో ఆలూరు, రాయదుర్గం, రాజాం, ఎచ్చెర్ల, కనిగిరి లేదా మార్కాపురం, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌, పెనమలూరు, జగ్గయ్యపేట,పాయకరావుపేట, పెందుర్తి, పెడన, ఉదయగిరి, గంగాధర నెల్లూరు, బద్వేలు, కోడుమూరు, పి.గన్నవరం, రాజోలు ఉండవచ్చని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రస్తుత స్థానాల నుంచి మారుస్తారని, మరికొందరికి అసలు టికెట్లు ఇవ్వరని చర్చ జరిగినప్పటికీ వీరిలో మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెంకటరామిరెడ్డి, వసంత కృష్ణప్రసాద్‌ను వారి సిట్టింగ్‌ స్థానాల్లోనే కొనసాగించనున్నారు. హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా బళ్లారికి చెందిన శ్రీరాములు సోదరి శాంతమ్మ పేరు పరిశీలనలో ఉంది. తొలివిడత జాబితా ప్రకటన తర్వాత మార్పులు చేర్పులకు వైసీపీ నాయకత్వం కొంత విరామం ఇవ్వనుంది.


తెలుగుదేశం-జనసేన పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వరకూ వేచి చూడనుంది. వారి అభ్యర్థులను ప్రకటించాక..ప్రత్యర్థి బలాబలాలను బేరీజు వేసుకొని, అక్కడ వైసీపీ ఆశావహుల బలాన్ని సమీక్షించుకొని మార్పులు చేయనుంది. రేపల్లెలో తనకు అవకాశం లేకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఎంపీ మోపిదేవి వెంకట రమణతో శుక్రవారం ఆ ప్రాంత వైసీపీ సమన్వయకర్త విజయసాయిరెడ్డి మాట్లాడారు. తర్వాత మోపిదేవి సీఎంవోకు వెళ్లారు. అక్కడ ఓ ఉన్నతాధికారి ఆయన ముందు కొత్త ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. రేపల్లె సమీపంలోని అవనిగడ్డ నుంచి పోటీ చేస్తే రేపల్లెపై కూడా ప్రభావం చూపవచ్చని చెప్పినట్లు తెలిసింది. అందుకు అంగీకరించని మోపిదేవి..... తనకు రేపల్లే ఇవ్వాలని స్పష్టం చేశారని తెలుస్తోంది. మరోవైపు CMO చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణ.. శుక్రవారమూ కొనసాగింది. ఎంపీలు బాలశౌరి, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కురసాల కన్నబాబు, దేవినేని అవినాష్‌ తాడేపల్లి వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి,విజయసాయి రెడ్డి., ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.ఈసారి ఎమ్మిగనూరులో చేనేత వర్గానికి చెందిన వారికే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించామని, ఆ వర్గం వారుంటే తీసుకురావాలని ఎమ్మెల్యేకు పార్టీ అధినాయకత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మాచాని వెంకటేశ్‌ను వెంటబెట్టుకుని సీఎం వద్దకు వచ్చారు. వెంకటేశ్‌ను అభ్యర్థిగా ఖరారు చేస్తే మద్దతిస్తామని చెప్పారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వెంకటేశ్‌ పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story