AP PRC: పీఆర్సీ సాధన సమితి నేతలతో జగన్ సమావేశం..

AP PRC: పీఆర్సీ సాధన సమితి నేతలతో జగన్ సమావేశం..
AP PRC: ఏపీలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం ముగిసిన తర్వాత జగన్‌.. సాధన సమితి నేతలతో సమావేశమయ్యారు.

AP PRC: ఏపీలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం ముగిసిన తర్వాత సీఎం జగన్‌.. పీఆర్సీ సాధన సమితి నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌తో పాటు ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, శనివారం మంత్రుల కమిటీ చేసిన ప్రతిపాదనలు, ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రికి ఇరువర్గాలు వివరించారు. ఐఆర్ రికవరీ, హెచ్ఆర్ఏ సహా అన్ని అంశాలపై చర్చించిన జగన్.. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు చేయగలిగినంత చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా మంత్రుల కమిటీ పనిచేస్తుందని వారికి హామీ ఇచ్చారు.

రిటైర్మెంట్‌ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. HRA రూపంలో అదనంగా 325 కోట్లు, రికరింగ్ వ్యయం రూపంలో HRA వల్ల 800 కోట్లు, అడిషనల్ క్వాంటమ్‌ పెన్షన్‌, సీసీఏ వల్ల రూ.1330 కోట్లు ఇలా వివిధ రూపాల్లో మొత్తం 11 వేల 500 కోట్లు భారం ఖజానాపై పడుతుందని సీఎం అన్నారు. రాబోయే రోజుల్లో సీపీఎస్‌ మీద గట్టిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.

అందరి సహకారంతోనే మెరుగైన పాలన అందిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. ఐఆర్ రికవరీపైనా సజ్జల స్పష్టత ఇచ్చారు. ఐఆర్ 30 నెలల కాలానికి సర్దుబాటు చేయాల్సి ఉన్నా.. 9 నెలలకు సంబంధించిన ఐఆర్‌ను ప్రభుత్వం మినహాయించిందన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై 5 వేల 400 కోట్ల భారం పడుతోందని తెలిపారు.

అలాగే హెచ్‌ఆర్ఏ రూపంలో మరో 325 కోట్ల భారం పడుతోందని సజ్జలు స్పష్టంచేశారు. మరోవైపు ఫిట్‌మెంట్‌ సహా కొన్ని హామీల విషయంలో అనుకున్నంత న్యాయం జరగలేదు అంటూనే సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు పీఆర్సీ సాధన సమితి నేతలు. 3 ప్రధానమైన అంశాలు లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయనే విషయాన్నిసీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

కొన్నింటిపై ముఖ్యమంత్రి నుంచి సానుకూల నిర్ణయం వచ్చిందని అన్నారు. ఉద్యోగుల మద్దతుతో ఉన్నంతలో మెరుగైన ఫలితాలను రాబట్టుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా తామంతా ఐక్యంగా ఉండి పోరాటం సాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టంచేశారు. ప్రభుత్వంతో చర్చలు అనంతరం సమ్మె విరమించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు భగ్గుమంటున్నారు.

పీఆర్సీ సాధన సమితి జేఏసీకి రాజీనామా చేసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు.. యూటీఎఫ్, ఏపీటీఫ్ కలిసి ప్రత్యేక ఉద్యమ కార్యాచరణతో ఒంటరిగా పోరాడేందుకు రెడీ అవుతున్నారు. మరి పీఆర్సీ పోరు ఇంతటితో ముగుస్తుందా..? లేక మరో రూపంలో ఉద్యమం ఉరకలేస్తుందా..? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story