Chandrababu Naidu : 4 రోజులు.. 36కు పైగా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు

సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ లో నాలుగు రోజులపాటు విస్తృతంగా పర్యటించారు. మొత్తం 36 కు పైగా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం ప్రతిపాదనలు చేశారు. ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాలతో మూడు సమావేశాలు నిర్వహించారు. అలాగే గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, ఆర్సెల్ ఆర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ లాంటి 16 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో నిర్వహించిన తొమ్మిదికి పైగా సెషన్స్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని తన ఆలోచన విధానాలను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించి ప్రపంచ వేదిక పైన ఏపీ బ్రాండ్ ను మరింత పెంచేందుకు కృషి చేశారు.
2025 ధావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని చంద్రబాబు నాయుడు వివరించారు. ఈసారి గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టూరిజం, వ్యవసాయం లాంటి రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను దావోస్ లో సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. దావోస్ లో ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. యూత్ స్కిల్స్, వ్యాపార సమర్థత, పాలసీల విధానాల్లో మార్పులు తమ ప్రభుత్వం ఎక్కువగా అమలు చేస్తోందని.. అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు అనేక సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
ఈ దావోస్ పర్యటన ద్వారా ప్రపంచ మార్కెట్ కు ఏపీ అనుకూలంగా ఉంటుందని సంకేతాలను ఇచ్చినట్టు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఆయన రేపు ఏపీకి రాబోతున్నారు. రేపు ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్ చేరుకొని అక్కడ నుంచి అమరావతికి వస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. అనంతరం ఉదయం 11:30 గంటల నుంచి అమరావతి సచివాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
