YS Jagan : రాజధానిపై మాట తప్పి, మడమ తిప్పిన జగన్

YS Jagan :  రాజధానిపై మాట తప్పి, మడమ తిప్పిన జగన్
YS Jagan : మాట తప్పడు, మడమ తిప్పడు. ఇప్పుడీ స్లోగన్‌ ఎక్స్‌పైరీ అయిపోయింది. జగన్‌ మాట తప్పారు, మడమ తిప్పేశారు.

YS Jagan : మాట తప్పడు, మడమ తిప్పడు. ఇప్పుడీ స్లోగన్‌ ఎక్స్‌పైరీ అయిపోయింది. జగన్‌ మాట తప్పారు, మడమ తిప్పేశారు. రాజధాని విషయంలో ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం జనంలో కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ను తలదన్నే రాజధాని కావాలన్నారు. ఒకే చోట స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, మాల్స్, థియేటర్స్‌.. ఇలా సంపూర్ణమైన రాజధాని కావాలన్నారు. 2014కు ముందు కూడా హైదరాబాద్‌ లాంటి రాజధాని అని కలవరించిన వ్యక్తి జగన్ అంటూ గుర్తుచేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రిని అవుతానన్న భావనతో ఏకంగా యాక్సెంచర్‌ కంపెనీ వాళ్లని పిలిపించుకుని.. రాజధానిపై ఓ డిజైన్‌ రూపొందించుకున్నది నిజం కాదా అని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం. హైదరాబాద్‌ను తలదన్నే రాజధాని నిర్మిస్తానని ఓ గ్రాఫిక్స్‌ తయారుచేయించుకుని 2014 ఎన్నికలప్పుడు ప్రచారం చేసుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రతిపక్ష నేతగా కూర్చున్నప్పుడు కూడా.. రాజధాని బాహుబలిలా ఉండాలన్నారు. 500, వెయ్యి ఎకరాలు కాదు.. ఏకంగా 30వేల ఎకరాల్లో నిర్మించాలన్నారు. 30వేలు కాదు.. 33 వేల ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా సేకరించి చూపించారు చంద్రబాబు. ఆ క్షణాన.. నిండు అసెంబ్లీలో.. ఓ ప్రతిపక్షనేతగా రాజధానిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారంలోనూ.. తాను ఇల్లు ఇక్కడే కట్టుకున్నా.. అమరావతి రాజధానికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నానంటూ ప్రచారం చేశారు. ఎన్నికల ముందు రాజధానిపై జగన్‌ మాట్లాడిన మాటలను ప్రతి ఒక్కరూ నమ్మారు. జగన్‌ అంతలా నమ్మించారు కూడా.

ఎన్నికల్ల్లో గెలిచాక అమరావతి అనే పేరు వినడానికి కూడా ఇష్టపడలేదు జగన్. ఆరు నెలల్లోనే మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఒకనాడు హైదరాబాద్‌ స్థాయి రాజధాని కట్టాలన్న జగనే.. మూడు చోట్ల రాజధాని నిర్మిస్తే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి జరుగుతుందని చెప్పడం మొదలుపెట్టారు. సెక్రటేరియట్, హైకోర్ట్, అసెంబ్లీ.. ఈ మూడు ఒకే చోట ఉండడం వల్ల కేవలం 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయంటూ కొత్త పాట మొదలుపెట్టారు. కాని, జగన్‌ చేసిన ఈ కామెంట్‌ విన్న తరువాత.. ఆయనలో పరిపక్వత లోపించిందని బహిరంగంగానే చెబుతున్నారు రాజకీయ విమర్శకులు. సెక్రటేరియట్, హైకోర్ట్, అసెంబ్లీ.. ఈ మూడు ఒకే చోట ఉన్నా 29 గ్రామాలే అభివృద్ధి చెందుతున్నప్పుడు.. కేవలం ఒక హైకోర్టును తీసుకుని వెళ్లి కర్నూలు శివారులో పెట్టినంత మాత్రాన రాయలసీమ మొత్తం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నిస్తున్నారు.

సచివాలయాన్ని తీసుకెళ్లి విశాఖలో పెట్టినంత మాత్రాన.. ఆ ఒక్కదాని వల్లే ఉత్తరాంధ్ర మొత్తం ఎలా బాగుపడుతుందని ప్రశ్నలు వేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో జగన్‌కు అస్సలు స్పష్టతే లేదని, అమరావతి అనే పేరు వినిపించకూడదు కాబట్టే పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఈ విషయంలో పార్లమెంట్‌దే నిర్ణయాధికారం అని ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాని, కోర్టుల జోక్యం శాసన వ్యవస్థలో ఉండకూడదంటూ మాట్లాడారు జగన్.

అమరావతినే పరిపూర్ణ రాజధానిగా నిర్మించాలని హైకోర్టు కుండబద్దలు కొట్టినట్టు చెబితే.. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానం అని మరోసారి చెప్పుకొచ్చారు జగన్. ఒక విధంగా ఇది కోర్టు తీర్పును అవమానపరచడమేనన్న మాట వినిపిస్తోంది. పైగా రాజధానిని ఏ విజయవాడలోనో, గుంటూరులోనో కడితే సరిపోయేదంటూ మాట మార్చారు. రాజధానికి 500 ఎకరాలు, వెయ్యి ఎకరాలు సరిపోయేది కదా అంటూ మడమ తిప్పేశారు. ఒకప్పుడు 30వేల ఎకరాలు కావాలి, బాహుబలి లాంటి రాజధాని ఉండాలి అని చెప్పిన జగనే.. నిన్నటి అసెంబ్లీలో రాజధానికి 500 ఎకరాలు సరిపోయేది అంటూ మాట్లాడారు.

కోర్టు ఒక తీర్పు చెప్పినప్పుడు దాన్ని శిరసావహించాల్సిందే. ఒకవేళ ఆ తీర్పుతో న్యాయం జరగలేదని భావిస్తే.. పైకోర్టుకు వెళ్లాలి. న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లొచ్చు. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో అదే ఫైనల్ అవుతుంది. అంటే, కోర్టులో తేల్చుకోవాల్సిన విషయాలను కోర్టుల ద్వారానే తేల్చుకోవాలి. కాని, అందుకు విరుద్ధంగా శాసనసభలో కోర్టు తీర్పులపై చర్చ పెట్టడం ఏంటని విమర్శిస్తోంది టీడీపీ.

అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు మధ్య తేడా తెలీదా? అధికార వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్‌కు అర్ధం తెలుసా? నిన్న అసెంబ్లీలో జగన్‌ స్పీచ్‌ విన్నాక.. చంద్రబాబు చేసిన విమర్శ ఇది. హైకోర్టు ఒక చోట, సెక్రటేరియట్ మరో చోట పెడితే అది అధికార వికేంద్రీకరణ అవుతుంది తప్ప.. అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుందని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసలు సెక్రటేరియట్, హైకోర్టు తరలింపుతో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఏ నమూనా చెబుతోందంటూ ప్రశ్నించారు. అసలు అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు కూడా జగన్‌కు లేదంటూ విమర్శించారు.

ఏదేమైనా రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదన్నది ముమ్మాటికీ వాస్తవం. దీని ప్రకారమే కోర్టు తీర్పు ఇచ్చింది. రేప్పొద్దున పైకోర్టుకు వెళ్లినా సరే ఒప్పందం రద్దు చేయొచ్చని ఏ ధర్మాసనం చెప్పదు అంటూ న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. హైకోర్టు తన తీర్పులో సీఆర్డీఏ చట్టంలోని నిబంధనల గురించి స్పష్టంగా వివరించింది. రాజధానికి భూములు ఇస్తే.. బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణంతో ఆ ప్లాట్లకు విలువ పెరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చి ఓ ఒప్పందం కుదుర్చుకుందని హైకోర్టు గుర్తు చేసింది.

ఇప్పుడు అమరావతిని కాదనడం, మూడు రాజధానులకు వెళ్లడం.. రైతులకున్న జీవించే హక్కు, ఆస్తి హక్కును ఉల్లంఘించడమే అని స్పష్టం చేసింది. కాని, అటు జగన్, ఇటు అధికార పార్టీ నేతలు ఆ అంశాల జోలికే వెళ్లలేదు. ఏదేమైనా ఒకప్పుడు అమరావతే రాజధానిగా ఉండాలని అంగీకరించిన జగన్.. ఇప్పుడు మూడు రాజధానులు కావాలంటే వాదించడం విడ్డూరంగా ఉందంటూ మాట్లాడుకుంటున్నారు ఏపీ జనం.

Tags

Read MoreRead Less
Next Story