AP: సిద్ధం సభలతో ప్రజలపై జగన్ యుద్ధం

AP: సిద్ధం సభలతో ప్రజలపై జగన్ యుద్ధం
ఆర్టీసీ బస్సులను భారీగా తరలించడంతో ప్రయాణికుల పాట్లు... వాహనదారులకు చుక్కలు....

మేమంతా సిద్ధం పేరుతో జగన్‌ చేస్తున్న బస్సు యాత్ర జనంపై యుద్ధంలా తయారయింది. సీఎం సభకు ఆర్టీసీ బస్సులను భారీగా తరలించడంతో ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతంగా మారాయి. గన్నవరం, గుడివాడలో బల ప్రదర్శన కోసం భారీగా జనసమీకరణ చేసినా అనుకున్నస్థాయిలో ఆదరణ లభించడం లేదు. గంటల తరబడి యాత్రను నగరాల్లో నిలిపివేస్తూ ట్రాఫిక్‌జామ్‌ అయ్యేలా చేసి వాహనదారులకు చుక్కలు చూస్తున్నారు.


కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర పేలవంగా సాగింది. ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సిన యాత్ర... జనసమీకరణ లేక పదిన్నరవరకు ప్రారంభం కాలేదు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాలనుంచి జనాలను ఆటోల్లో తరలించారు. గన్నవరం గాంధీబొమ్మ కూడలి వద్ద భారీగా జనాలున్నారని చూపించేందుకు జాతీయ రహదారికి అడ్డుగా డీజే బాక్సులతో కూడిన వాహనాన్ని అడ్డుగా పెట్టారు. భారీగా ట్రాఫిక్‌జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైకాపా నాయకుల ప్రచార పిచ్చితో అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. హనుమాన్ జంక్షన్ సమీపంలోని అరుగోలను గ్రామంలో వైకాపా జెండాలు కట్టిన వాహనాలతోనే వెళ్లి వైకాపా కార్యకర్తలు మద్యం కోనుగోలు చేశారు.


గన్నవరంలో జనాలను దింపిన తర్వాత... ఆర్టీసీ బస్సులు పెద అవుటపల్లి వద్ద రోడ్డుపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను... పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. కమిటీ ప్రధాన కార్యదర్శి బసవ అరుణను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. గన్నవరంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను మూసివేశారు. గన్నవరం పరిసర ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గుడివాడలో సీఎం జగన్ నిర్వహించిన మేమంతా సిద్దం బహిరంగసభకు ఆర్టీసీ బస్సులు భారీగా తరలించారు. విజయవాడ నుంచి మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, గుంటూరు, నందిగామ తదితర ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను రద్దు చేసి సీఎం సభకు మళ్లించారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక అష్టకష్టాలు పడ్డారు. బాపట్ల ఆర్టీసీ డిపో నుంచి సీఎం సభకు 30 బస్సులు కేటాయించారు. బాపట్ల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను రద్దు చేశారు. తగినన్ని బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story