AP: జగన్ ఎన్నికల ప్రచారం.. జనానికి విచారం

AP: జగన్ ఎన్నికల ప్రచారం.. జనానికి విచారం
జగన్‌ ప్రచారం వేళ విద్యుత్‌ సరఫరా నిలిపివేత.. బస్సు యాత్ర జరిగే మార్గంలో దుకాణాలను మూసివేత

వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం జనానికి విచారం కలిగిస్తోంది. అసలే ఎండలకు మండిపోతున్న ప్రజలకు పుండు మీద కారం జల్లినట్లు విద్యుత్‌ సరఫరా నిలిపివేడంతో అల్లాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో బస్సు యాత్ర జరిగే మార్గంలో దుకాణాలను మూసివేడంపై చిరు వ్యాపారస్తులు చిర్రెత్తిపోయారు. ఆర్టీసీ బస్సులను సభకు దారి మళ్లించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రతో సామాన్యులకు అవస్థలు తప్పలేదు. బస్సు యాత్ర కొనసాగే మార్గం పొడవునా సోమవారం నుంచే విద్యుత్ తీగలను తొలగించారు. గణపవరం మండలంలో ఉదయం విద్యుత్ తీగలు కత్తిరించి సరఫరా నిలిపివేశారు. అసలే ఎండాకాలం కావడం ఆపై ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. గతంలో ఎంతోమంది C.M.లు, ప్రముఖులు వచ్చినా ఇలా ఎప్పుడూ విద్యుత్ సరఫరా నిలిపివేయలేదని ప్రజలు మండిపడ్డారు. యాత్ర ప్రారంభం కాకముందు నుంచే దుకాణాలు మూసివేయించడంతో దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మేమంతా సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో.... ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని డిపోల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేక ఉక్కపోతతో నరకం చూశారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో... గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఆరుబయటే సెలైన్ ఎక్కించారు. భీమవరంలో సీఎం బస్సు యాత్ర జరిగే... ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్ద చెట్లను వేళ్లతో సహా తీసేశారు. అదేవిధంగా విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లను సైతం తొలగించేశారు. అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి ప్రజలు ఇ్బబందులు పడ్డారు.

మేమంతా సిద్ధం పేరుతో జగన్‌ చేస్తున్న బస్సు యాత్ర జనంపై యుద్ధంలా తయారయింది. సీఎం సభకు ఆర్టీసీ బస్సులను భారీగా తరలించడంతో ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతంగా మారాయి. గన్నవరం, గుడివాడలో బల ప్రదర్శన కోసం భారీగా జనసమీకరణ చేసినా అనుకున్నస్థాయిలో ఆదరణ లభించడం లేదు. గంటల తరబడి యాత్రను నగరాల్లో నిలిపివేస్తూ ట్రాఫిక్‌జామ్‌ అయ్యేలా చేసి వాహనదారులకు చుక్కలు చూస్తున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర పేలవంగా సాగింది. ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సిన యాత్ర... జనసమీకరణ లేక పదిన్నరవరకు ప్రారంభం కాలేదు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాలనుంచి జనాలను ఆటోల్లో తరలించారు. గన్నవరం గాంధీబొమ్మ కూడలి వద్ద భారీగా జనాలున్నారని చూపించేందుకు జాతీయ రహదారికి అడ్డుగా డీజే బాక్సులతో కూడిన వాహనాన్ని అడ్డుగా పెట్టారు. భారీగా ట్రాఫిక్‌జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైకాపా నాయకుల ప్రచార పిచ్చితో అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. హనుమాన్ జంక్షన్ సమీపంలోని అరుగోలను గ్రామంలో వైకాపా జెండాలు కట్టిన వాహనాలతోనే వెళ్లి వైకాపా కార్యకర్తలు మద్యం కోనుగోలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story