కేంద్ర బృందం ఏపీలో పర్యటించకపోవడంలో లాలూచీ ఏంటీ?: సీపీఐ రామకృష్ణ

ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5,06,493 కరోనా కేసులు నమోదయ్యాయని.. ఇప్పటివరకూ 4,487 మంది కరోనాతో మరణించారని రామకృష్ణ అన్నారు. రోజువారీ కేసులు 10 వేలకు పైగా నమోదవుతూ.. అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాల్లో రెండోస్థానానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం కరోనా ప్రభావం ఆందోళనకరంగా ఉంటే.. సీఎం జగన్ మాత్రం ఈ విషయాన్ని పక్కన పెట్టి తమ ఎజెండా అమలు చేయడంలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే, ఏపీలో మాత్రం ఎందుకు పర్యటించడంలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర బృందం ఏపీకి రాకపోవడంలో లాలూచీ ఏంటని ద్వజమెత్తారు. ఏపీకి కూడా కేంద్ర బృందాల్ని పంపాలని.. కరోనా కట్టడికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com