ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని స్థాయిలో పెరిగిన క్రైమ్ రేట్.. ఎంతో చూస్తే
ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్ రేట్ ఊహించని స్థాయిలో పెరదడం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరహా నేరాల రేటు జాతీయ స్థాయిలో కంటే ఏపీలోనే అత్యధికంగా ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక రావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 4.5శాతం ఏపీలోనే జరగుతున్నాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అంశంలో రాష్ట్రం ఆరోస్థానంలో ఉంది. రాజకీయ కక్షలు నేపథ్యంలోనో.. ఇతర పార్టీల సానుభూతిపరులనే కారణంతోనో.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనో.. ఇలా వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్నాయి.
కేవలం దళితులపై దాడుల అంశమే కాదు.. ఆర్థిక, సైబర్ నేరాలు, వృద్ధులు, మహిళలపై నేరాల్లోనూ గతంతో పోలిస్తే గణనీయ వృద్ధి పెరిగింది. చిన్నారులపై నేరాలు స్వల్పంగా తగ్గాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయని నివేదికలో ఉంది.
మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ ఏపీ అగ్రస్థానంలోనే ఉంది. మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉండడం శోచనీయం. ఐపీసీ, స్థానిక ప్రత్యేక చట్టాలులోని సెక్షన్ల ప్రకారం అన్నిరకాల నేరాలకు సంబంధించి రాష్ట్రంలో 2019లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2018 కంటే 1.16శాతం మేర పెరిగింది. 2019 సంవత్సరానికి సంబంధించి ఎన్‌సీఆర్‌బీ నిన్న విడుదల చేసిన ఈ వార్షిక నివేదిక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితికి అద్దం పట్టింది.
మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు 6,454 చోటుచేసుకోగా అందులో 1,892 ఏపీలోనే జరిగాయని పేర్కొంది. పనిప్రదేశాల్లో, ప్రజారవాణాలో ఈ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని నివేదికలో చెప్పింది. ముఖ్యంగా ఎస్సీలపై నేరాలకు సంబంధించి 2018లో 1,836 కేసులు నమోదుకాగా 2019లో ఆ సంఖ్య 2,071కు చేరింది. 12.79శాతం మేర పెరిగినట్టు స్పష్టం చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లో 84.5 లక్షల మంది ఎస్సీ జనాభా ఉండగా..లక్ష మంది జనాభాకు 24.5 నేరాలు జరిగుతున్నాయని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com