Babu Arrest: అరెస్టుకు నిరసనగా పలుచోట్ల ఆందోళనలు

Babu Arrest:  అరెస్టుకు నిరసనగా పలుచోట్ల  ఆందోళనలు
ఎక్కడికక్కడే గృహనిర్బంధాలు, అరెస్టులు

చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం అట్టుడికింది. అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం వేధిస్తోందని తెలుగుదేశం ఆగ్రహించింది. ఊరూవాడ తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలిపాయి. నేతలు, కార్యకర్తలు రోడ్డుపైకి చేరి ఆందోళన బాట పట్టారు. నిరసనలపై ఉక్కుపాదం మోపిన పోలీసులు ఎక్కడికక్కడే గృహనిర్బంధాలు, అరెస్టులు చేశారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, నందిగాంలో తెదేపా శ్రేణులు ధర్నాలు చేపట్టారు. నరసన్నపేటలో పాత జాతీయ రహదారిపై కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. ఇచ్ఛాపురం MLA బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గుండా లక్ష్మీదేవితో పాటు మరికొందరిని ఎచ్చెర్ల AR కార్యాలయంలో గృహనిర్బంధం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెదేపా నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్టు దుర్మార్గమని మండిపడ్డారు. చీపురుపల్లిలో తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. విశాఖ పెందుర్తి కూడలిలో నేతలు ధర్నాకు దిగారు.


చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ధర్నా చేస్తున్న నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును బలవంతంగా అరెస్టు చేశారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు భీమవరంలోని ఆయన స్వగృహంలో 24 గంటల దీక్ష చేపట్టారు. మండపేటలో ఆందోళనకు దిగిన తెదేపా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను తాళ్లరేవు మండలం కోరంగిలో అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దెందులూరులో జాతీయ రహదారిపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.


ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరులో తెదేపా నేతలు రోడ్డెక్కారు. మంగళగిరిలోనూ ర్యాలీ చేపట్టారు. నిరసనను అడ్డుకోవడంతో... పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారంటూ కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని ముందస్తుగా గృహనిర్భంధం చేశారు. కనిగిరి నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.



ఆదోనిలో తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోడుమూరులో రోడ్డుపై బైఠాయించి... సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నంద్యాలలో రోడ్డెక్కిన తెదేపా నాయకులు... శ్రీనివాసనగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ప్రొద్దుటూరులో సురేష్ నాయుడు ఆధ్వర్యంలో తెదేపా నేతలు నల్ల జెండాలు పట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కందుకూరులో రోడ్లపై నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. మదనపల్లెలో నల్లజెండాలతో రహదారిపై ఆందోళన చేశారు. ఉరవకొండలో గాంధీవిగ్రహం ఎదుట తెలుగు యువత నాయకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story