Rajagopal Reddy :జగన్ ను కలవడానికి రాలేదు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్ఫూర్తిగా తీసుకునే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన కుటుంబంపై తమకు ఇప్పటికీ ఎంతో అభిమానం ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన గుంటూరు పర్యటనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. "నేను ఏపీకి వస్తున్నానని తెలియగానే, జగన్‌ను కలవడానికేనని ప్రచారం మొదలుపెట్టారు. నేను వెంటనే మీడియా ముందు ఆ ప్రచారాన్ని ఖండించాను. నా ప్రతి కదలికపైనా, ప్రతి మాటపైనా చర్చ జరుగుతోంది" అని ఆయన పేర్కొన్నారు. తన మిత్రుడి ఆహ్వానం మేరకే గుంటూరు కు వచ్చినట్లు స్పష్టం చేసారు.
అదే విధంగా వైఎస్సార్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. "ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్సార్ శిష్యులు అనేవారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. వైఎస్సార్ చనిపోయినప్పుడు కన్నీరు పెట్టని కుటుంబం లేదు" అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. కాగా ఈ కార్యక్రమానికి ఆయన భారీ కాన్వాయ్‌తో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలతోపాటు సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com