DMK Leaders : పవన్ కళ్యాణ్ కు డీఎంకే నేతల కౌంటర్

హిందీ, ఇంగ్లీష్, మాతృభాష అంశం కేంద్ర ప్రభుత్వానికి, డీఎంకే ప్రభుత్వానికి మధ్య పెను వివాదం రాజేస్తోంది. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారని... అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కావాలా? హిందీ మాత్రం వద్దా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. రూపాయి సింబల్ ని కూడా మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడం ఏమిటని విమర్శించారు. వివేకం, ఆలోచన ఉండొద్దా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. వ్యక్తిగతంగా హిందీని కానీ, ఇతర భాషలను కానీ నేర్చుకోవడానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. ఆసక్తి ఉన్నవారి కోసం తమ రాష్ట్రంలో ఇప్పటికే హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంపై ఎన్ఈపీ, పీఎం శ్రీస్కూల్స్ వంటి విధానాలతో బలవంతంగా హిందీని రుద్దుతోందని... దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
తమిళులపై హిందీని బలవంతంగా రుద్దుతుండటాన్ని 1938 నుంచే వ్యతిరేకిస్తున్నామని మరో నేత ఇళంగోవన్ చెప్పారు. ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని ఇప్పటికే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించుకున్నామని తెలిపారు. ఆ బిల్లు ఆమోదం పొందే సమయానికి పవన్ ఇంకా పుట్టి ఉండరని చెప్పారు. తమిళ రాజకీయాలపై పవన్ కు అవగాహన ఉండకపోవచ్చని అన్నారు. మరోవైపు పవన్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com