AP: నీటి ఎద్దడితో అల్లాడుతున్న ఏపీ ప్రజలు

AP: నీటి ఎద్దడితో అల్లాడుతున్న ఏపీ ప్రజలు
జగన్‌ ప్రభుత్వ ప్రణాళిక లోపంతో అవస్థలు... ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తీవ్రంగా తాగునీటి సమస్య

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తీవ్రమైన నీటిఎద్దడితో అల్లాడిపోతున్నారు. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులున్నా జగన్‌ ప్రభుత్వం మేల్కోలేదు. సర్కార్‌ ప్రణాళికా లోపంతో పల్లెలు, పట్టణాల్లోని ప్రజల గొంతు ఎండుతోంది. సీమతోపాటు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల వారం రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. మరికొన్ని చోట్ల అదీ కూడా లేదు. ఫలితంగా జనం రోడ్డెక్కుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ముందుముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


జగన్‌ సర్కార్‌ ప్రణాళికా లోపం ముందుచూపు లేమి వల్ల ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. మూడునెలలుగా దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు లేక జలాశయాలు నిండుకుంటున్నాయి.. చెరువులు ఎండిపోయాయి. కాల్వల్లో చుక్కనీరు లేదు. దీనివల్ల ఎండాకాలంలో నీటికొరత తలెత్తుతుందని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ జగన్‌ సర్కార్‌కు మాత్రం అవేవీ కనిపించలేదు. ఫలితంగా ఊళ్లలో తాగేందుకే కాదు.. రోజువారి అవసరాలకు నీళ్లు లేక గ్రామీణ, పట్టణ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రకాశం, పల్నాడు, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురం, పొదిలి, యర్రగొండపాలెం పట్టణాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఈటీవీ-ఈనాడు క్షేత్రస్థాయిలో రెండు రోజులు పరిశీలించింది. ఊరూరా జనం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న దృశ్యాలే కనిపించాయి. నీటి ట్యాంకర్లు ఎప్పుడొస్తాయోనని మహిళలు ఖాళీ బిందెలతో నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని, పత్తికొండ, ఆలూరు తదితర నియోజకవర్గాల్లో జనం తిప్పలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

గతేడాదితో పోల్చుకుంటే ఈసారి భూగర్భ జలాలు దాదాపు రెట్టింపు స్థాయిలో దిగజారినా, సర్కార్‌ మేల్కోలేదు. చాలాచోట్ల మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్‌ బస్సు యాత్రను అడ్డుకున్నారు. నీళ్ల ట్యాంకర్ల కోసం పనులు మానుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. కొన్నిచోట్ల నీటిట్యాంకర్ల కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది. నీటి ఎద్దడితో పశువులను ఎలా కాపాడుకోవాలని పాడి రైతులు వాపోతున్నారు. కరవుతో పొలాలన్నీ ఎండిపోయాయి. ట్రాక్టర్‌ ఎండుగడ్డిని 14 వేలకు కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు గేదెల్ని అమ్ముకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రజల ఆందోళనతో కదలిక వచ్చిన జగన్‌ సర్కారు పొదిలిలో 600 ఎకరాల పెద్దచెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించింది. అందులో భాగంగా దర్శి నుంచి చెరువుకు సాగర్‌ జలాల్ని తరలించేందుకు పైపులైన్‌ నిర్మాణానికి 2023 ఏప్రిల్‌లో సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి త్రిపురాంతకం నుంచి పైపులైన్లు వేసే పనుల్ని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story