Editorial : ఈ పొత్తు జనం కోసం...

Editorial : ఈ పొత్తు జనం కోసం...
పేదవాడి భయం నుంచి పొడుస్తున్న పొత్తు....

2024లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 2023 ఆరంభంలోనే ఒక ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. సహజంగా ఎన్నికల పొత్తులనేవి షెడ్యూల్ వచ్చిన తర్వాతే రూపుదిద్దుకుంటాయి. అప్పటివరకు ఊహించని కలయికలు కూడా చోటుచేసుకుంటుంటాయి. దీనికి కారణం కేవలం రాజకీయ అవసరం. ఎవరెవరు కలిస్తే గెలుస్తారు... ఏ ఏ పార్టీలు కలిస్తే పవర్ దక్కుతుందనే లెక్కలే ఉంటాయి. పైకి ఎన్ని చెప్పినా రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికార పీఠాన్ని దక్కించుకోవడమే.



అలా పొత్తులు పెట్టుకుని ఓడిపోయాక ఎవరి దారి వారిదిగా విడిపోయిన సందర్భాలున్నాయి. గెలిచాక కూడా విడిపోయిన పార్టీలున్నాయి, 2009లో, 2014 లో టీడీపీ పొత్తుల చిత్రం చూస్తే ఇది స్పష్టమవుతుంది. ఆ సందర్భాల్లో అధికారమే లక్ష్యంగా జరిగిన పొత్తుల ప్రక్రియలవి. ఈసారి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేనల మధ్య కుదరబోతున్న పొత్తు మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ఇది జనం కోసం కుదురుకుంటున్న పొత్తు.. ప్రజలు కోరుకుంటున్న కలయిక. ఏపీలో వైసీపీ ఇన్నాళ్ళ పాలన చూశాక జనం ఎదురుచూస్తున్న పరిణామం..



మరోసారి వై.ఎస్. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందోనన్న పేదవాడి భయం నుంచి పొడుస్తున్న పొత్తు. వై.ఎస్. జగన్ మళ్లీ సీఎం అయితే మళ్ళీ ఏపీ ఎన్నడూ కోలుకోలేదనే విషయాన్ని చంద్రబాబు బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే స్లోగన్ వినిపిస్తున్నారు. వైసీపీ ఏపీకి హానికరం అనే ట్యాగ్ లైన్ తో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని ఎత్తుకుంది జనసేన. ఈ రెండు పార్టీలను కలుపుతోంది ఈ నినాదాలే. అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ నంబర్ వన్ గా ఉన్న ఏపీకి విభజన చేసిన గాయం అంతా ఇంతా కాదు. ఎక్కడైనా ఒక రాష్ట్రం విడిపోతే ఆ రాష్రం కొత్త రాజధాని ఏర్పాటు నుంచి అన్నీ వెతుక్కుంటూ కష్టాలు పడుతుంది. కానీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రమైంది. బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇటువంటి పరిస్థి ఏర్పడి ఉండదేమో.



అటువంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచి చంద్రబాబు సీఎం అయ్యారు. దానికి కారణం ఆయనపై ప్రజలకున్న నమ్మకమే. మళ్లీ ఏపీని ప్రపంచ పట్టంలో పెట్టే బృహత్ కార్యాన్ని భుజానకెత్తుకున్న చంద్రబాబు ప్రయాణానికి 2019లో ఫుల్ స్టాప్ పడింది. కాని ఆ రోజు ఏపీ ప్రజలకు అర్ధం కాలేదు. ఫుల్ స్టాప్ పడింది చంద్రబాబుకు కాదు ఏపీ భవితవ్యానికి అని. అది ప్రజలకు అర్దమవడానికి రెండు, మూడేళ్లు పట్టింది. ఇప్పుడు పూర్తిగా బోధపడింది. జగన్ పాలనకు నాలుగేళ్లు నిండబోతున్నాయి. అయిదేళ్ళ కాలానికి ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు.



ఏ రాష్ఠ్రంలోనైనా ప్రతి ముఖ్యమంత్రి తన పీరియడ్ లో ఇదీ నా పాలన అని చెప్పుకునే ఒక ముద్ర వేస్తారు. అది మర్రిచెన్నారెడ్డి నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు , కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వరకు ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా మనకు కనిపిస్తుంది. ఆ అయిదేళ్ళలో పూర్తయిన కొన్ని ప్రాజెక్టులు మన కళ్లముందు కనిపిస్తాయి. ఇలా 2014 నుంచి 2019 వరకు ఏపీని పరిశీలించినా పోలవరం నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తిచేశారు. కియా లాంటి ప్రతిష్టాత్మక కంపెనీకి శంఖుస్థాపన చేసి కారు కూడా బయటకి తెప్పించారు. ప్రజా రాజధాని అమరావతిలో పాలనా రాజధానికి అవసమైన అన్ని హంగులు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ జగన్ సర్కారు అక్కడినుంచే పాలన సాగిస్తోంది.



చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక హబ్ ల ఏర్పాటు, ఒర్వకల్లులో కొత్తగా విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లా లోను ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది. అలాంటిది జగన్ తన దాదాపు నాలుగేళ్ల పాలనలో ఏం చేశారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కానీ సమాధానం ఉంది. ఆయన ప్రభుత్వ హయాంలో అమరావతిని చంపేశారు. పోలవరం నిర్మాణాన్ని ఆపేశారు, ఏపీ నుంచి పరిశ్రలను తరిమేశారు,విపక్షాల నేతలను జైళ్ళకు పంపారు , బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై లెక్కలేనన్ని దాడులు చేశారు ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు, దళితులను చంపేసి శవాలను డోర్ డెలివరీ చేసే వరకు ఈ పాలనలో జరగని ఘోరాలు లేవు.



ఏ వర్గం ప్రజలకు కూడా నాలుగేళ్లలో ఒక్క రోజు కూడా హాయిగా ఊపిరి తీసుకున్నది లేదు. ఉద్యోగులకు నెలాఖరు వచ్చినా జీతాలు లేవు, ముదిమి వయసులో ఫించను పై ఆధారపడ్డ వారికి టైం కు ఫించను లేదు, ఇక పీఆర్సీలు, డీఏల మాటే ఎత్తవద్దు. జగన్ పాలనలో జనంపై బాదుడే బాదుడు. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రలోల్ డీజిల్ ధరలు పెరిగాయి, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను వచ్చింది. వీటన్నంటినీ మించి ప్రజలు స్వేఛ్చగా తమ భావాలను వ్యక్తీకరించే అవకాశం లేదు. ప్రజల్లోకెళ్ళి తమ భావాలను ప్రచారం చేసుకునే స్వేచ్ఛ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా అందరిమీద కేసులు, నిర్భంధాలు.. ఇవే నేడు టీడీపీ, జనసేనల మధ్య ఒక రాజకీయ అవగాహన ఏర్పడడానికి కారణమై ఉండొచ్చు. రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. ప్రత్నామ్నాయం ప్రజలనుంచి పుడుతుంది, ప్రజలకే తయారు చేసుకుంటారని. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది అదే.



టీడీపీ, జనసేన పార్టీలు కలసి ముందుకు సాగాలనేది ఒక చారిత్రక అవసరంగా మారింది. వాస్తవానికి ఇప్పటికీ ఈరెండు పార్టీల మధ్య అధికారికంగా ఎటువంటి పొత్తు కాని అవగాహన కానీ లేదు.విశాఖ ఘటనపై పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు విజయవాడలో ఆయన్ను కలిశారు. కుప్పం ఘటనలో సంఘీభావం వ్యక్తం చేసేందుకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. కానీ నిశితంగా పరిశీలిస్తే కింది స్థాయిలో ఈ రెండు పార్టీల క్యాడర్ మధ్య ఫ్రెండ్ షిప్ ఎప్పుడో కుదిరిపోయింది. నిజానికి ఇప్పటికీ బీజేపీ జనసేన మిత్రపక్షాలు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకున్నాయి. కానీ చాలా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈ ఒప్పందాన్ని పక్కనపెట్టి టీడీపీ, జనసేన కలసి పోటీచేసి గోదావరి జిల్లాలో విజయాలు సాధించాయి. పొత్తులు ప్రజల నుంచే పుడతాయనే దానికి ఇది సాక్ష్యంగా నిలుస్తోంది.



ఇదే ఇప్పడు మరింత విస్తృతమై అధినేతల కలయిక వరకు వెళ్లి పొత్తుల వరకు తీసుకెళ్తోంది. జనసేనలో అతి కొద్ది మందికి బహుశా టీడీపీ తో పొత్తు లేకుండా ఒంటిరిగా వెళ్దామనే భావన ఉన్నట్లుంది. దీనికి సంబంధించి కూడా పవన్ కల్యాణ్ వీరమరణం అసవరం లేదు. యుద్దంలో విజయం సాధించే మార్గంలో వెళ్ధామంటూ రణస్థలం వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. సభల్లో పవన్ కామెంట్స్ మాట్లాడే తీరు చూసినా విడిగా పరిశీలించినా ఆయనలో ఆవేశం కనిపిస్తుంది. అందుకే వైసీపీ ఆయన్ను గత అయిదారు నెలలుగా దమ్ముంటే సింగిల్ గా రా .. అంటూ సవాళ్లు విసిరింది. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన నేతలతోనే వైసీపీ ఈ సవాళ్లు చేయించింది. అయితే పరిణతితో వ్యవహరించిన జనసేనాని వీటిని లెక్కపెట్టలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అటే పయనం మొదలు పెట్టారు. టీడీపీతో పొత్తు ఉంటుందని దాదాపుగా చెప్పేసినా సీట్ల విషయంలో కొంత పట్టు బడతాననే సంకేతాలు కూడా ఇచ్చారు. అందుకే 2014లో టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఎన్ని సీట్లలో ఓడిపోయేదో ఒక లెక్క కూడా ప్రస్తావించారు.



చంద్రబాబు పవన్ ల భేటీలో మాత్రం సీట్ల లెక్కల ప్రస్తావనే రాలేదు. ఇటు బీజేపీతో మనసుతో కాకున్నా కాగితంపై ఉన్న బంధాన్ని పవన్ కల్యాణ్ వెంటనే తెంచుకోకపోవచ్చు. మరో వైపు బీజేపీ కూడా ఈరెండు పార్టీలతో కలిసొస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే మళ్లీ 2014 పొత్తులు రిపీట్ అయినట్లే.సీపీఐ చాలా కాలంగా జగన్ సర్కారుపై ముందుండి కొట్లాడుతోంది. సీపీఎం అమరావతి రాజధాని అంశంలో గందరగోళానికి గురై ఓ దశలో వైసీపీ అనుకూల ధోరణి అనే విమర్శను ఎదుర్కోవాల్సి వచ్చింది.గత కొంతకాలంగా సీపీఎం, ఆపార్టీ అనుబంధ సంఘాలు క్షేత్రస్థాయిలో గట్టి పోరాటాలే చేస్తున్నాయి. అయితే టీడీపీ,జనసేన బీజేపీతో కలిస్తే వామపక్షాలు వాటికి దూరంగా ఉంటాయి. లేకుంటే టీడీపీ, జనసేన,వామపక్షాలు కలిసి పోటీచేసే అవకాశముంది. జనసేన టీడీపీకి దగ్గిరవుతున్న పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది.



రాష్ట్ర బీజేపీలో ఒక వర్గం టీడీపీతో పొత్తు దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే మరో వర్గం వైసీపీకి మేలు చేసేలా టీడీపీతో పొత్తు వద్దంటోంది. అసలు బీజేపీతో పొత్తు లాభమా ?నష్టమా ? అనే అంశంలో టీడీపీలో మరో అంతర్మథనం కూడా సాగుతోంది.ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఈ సమీకరణలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల తాజా భేటీలో పోలవరం నిర్మాణం నిలిచిపోవడం, పరిశ్రమలు రాకపోవడం, ఏపీలో విద్య, ఉపాధి, ఉద్యగ అవకాశాలు లేకపోవడం వంటి మౌలిక అంశాలను చర్చించారు. అదే విధంగా జగన్ సర్కారు అనుసరిస్తున్న అణిచివేత వైఖరిపైనా మాట్లాడుకున్నారు. రాబోయే ఏడాది పాటు ఈరెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ చేపట్టే ఆలోచన చేస్తున్నాయి. తద్వారా కింది స్థాయిలో కార్యకర్తలు కూడా కలిసి పనిచేసుకునే వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఎవరూ పిలుపు ఇవ్వకున్నా గడపగడప పేరుతో వచ్చే ఎమ్మెల్యేలకు జనమే చుక్కలు చూపిస్తున్నారు. ఇంతటి ప్రజాగ్రహం చవిచూస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇంకెవరి సహకారం కావాలి ?

RAVIPATI

Tags

Read MoreRead Less
Next Story