Editorial: లోకేష్ "సెల్ఫీ" కాన్ఫిడెన్స్ ముందు వెలవెలపోతున్న జగన్ స్టిక్కర్ నమ్మకం

Editorial: లోకేష్ సెల్ఫీ కాన్ఫిడెన్స్ ముందు వెలవెలపోతున్న జగన్ స్టిక్కర్ నమ్మకం

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే అక్కడి ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న విస్తృతస్థాయి ప్రచార కార్యక్రమాలు చూస్తుంటే అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందా అన్న వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎక్కుపెట్టిన బహుముఖ బాణాలు జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే దెబ్బతిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ఆర్సిపి ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలపై మడమతిప్పిన వైనం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏమాత్రం పట్టింపు లేని నిర్లక్ష్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ముందు చూపులేని గందరగోళం, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ఇలా అన్ని కోణాల్లోనూ ప్రతిపక్ష తెలుగుదేశం ఎక్కు పెడుతున్న విమర్శనాబాణాలు జగన్ పార్టీ భవిష్యత్తును కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీకి నాలుగేళ్లు తిరగకుండానే ఇంతటి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు, రైతులు ఇలా ఏ వర్గం చూసిన ప్రభుత్వ పని తీరుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి దక్కిన అఖండ విజయం పూర్తిగా తన వల్లే వచ్చిందని తానే పార్టీకి అసలైన బలమన్న ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నడమే అందుకు ప్రధాన నిదర్శనం. అందుకే ఆయన తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు అన్నిటికీ ఆయన క్యాబినెట్ సహచరులు తలూపడం తప్ప చేసేదేమీ లేదు. కానీ ఆ నిర్ణయాల వ్యాతిరేక ప్రభావం ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా బయట పెట్టింది.

30 సంవత్సరాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించేందుకే రాజకీయాల్లో అడుగు పెట్టానన్న జగన్మోహన్ రెడ్డి పతనం ఇంత త్వరగా ప్రారంభమవుతుందని ఊహించి ఉండరు. అయితే పార్టీల బలాబలాల ను తేలిగ్గా తీసుకోని జగన్మోహన్ రెడ్డి దాన్ని సరిదిద్దుకోవడంలోనూ చేపడుతున్న వరుస ప్రోగ్రాములు వరుసగానే విఫలమవుతూ వస్తున్నాయి.

అయ్యవారిని చేయబోతే కోతి అన్న చందంగా....

ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను సవరించుకునేందుకు జగన్ చేపట్టిన పలు కార్యక్రమాలు ఫలితాలనివ్యకపోగా.. వైఫల్యాలు మరింత స్పష్టంగా బహిర్గతమవడం, దాని ఫలితంగా స్ధానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో నైరాశ్యం రావడం, కొందరు అసంతృప్తులగా మారడం జరుగుతోంది.

ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకత వ్యక్తం అయితే అది కేవలం ఎమ్మెల్యేల వైఫల్యం వల్లనే వ్యక్తం అవుతుంది అన్న భావనలో జగన్ ఉన్నట్టున్నారు. అందుకే వరుసగా సమీక్ష సమావేశాలు పెట్టి ఎమ్మెల్యేల పనితనం మెరుగుపరచుకోవాలనీ, గ్రాఫ్ పెరగకుంటే సీటు దక్కదనీ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించారు. ఈ ధోరణి ఎమ్మెల్యేల్లో కోర్స్ కరెక్షన్ కి పనికి రాకపోగా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను అవమానించారన్న ఆలోచనలో ఉన్న నలుగురు వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష అభ్యర్థికి ఓటేసి పార్టీకి నిజంగానే దూరమయ్యారు.

గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో నాలుగున్నర సంవత్సరాలలో తాను బటన్లు నొక్కడం ద్వారా ప్రజల ఖాతాలోకి చేరిన మొత్తాన్ని చూపించి వారి ఓట్లను హామీగా పొందే ప్రయత్నం చేసింది. మూడున్నర సంవత్సరాల పాటు ఓటర్లకు కనపడని ఎమ్మెల్యేలు ఒక్కసారిగా కరపత్రాలు పట్టుకొని తమ ఇంటికి రావడంతో ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ కొంతమంది, అసలు సమస్య తీర్చారా అంటూ మరి కొంతమందీ.. ఏం చేశావని మీతో మాట్లాడాలంటూ కొంతమంది నిలదీతలు మొదలుపెట్టారు. ఈ ప్రభావం ఆ ఒక్క ఇంటికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కావడంతో జగన్ సర్కారుకు పాస్ మార్కులు కంటే నెగిటివ్ మార్కులే ఎక్కువ పడ్డాయి.

తాజాగా నువ్వే మా నమ్మకం జగన్ అంటూ ఇంటింటికి తిరిగి ఓటర్లను ఒప్పించి వారి హామీ పొందే మరో ప్రయత్నం సాగుతోంది. దీనికి కూడా జగన్ ఊహించిన దాని కంటే ఎక్కువే వ్యతిరేకత ఎదురవుతుంది. ఏదైనా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే నేను ఇది చేశాను అని పదేపదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి లాంటి అనేక అంశాలను పక్కనపెట్టి కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఖాతాల్లో అప్పుచేసి తెచ్చిన డబ్బు జమ చేయడం ద్వారా వారి విశ్వాసం పొందవచ్చు అన్న స్వార్ధ ఆలోచన జగన్ కి మొదటికే ఎసరు పెడుతోంది. వైయస్ఆర్సీపీ జెండాలు, పార్టీ రంగులతో కుట్టిన చేతి సంచులు ధరించి ఇంటింటికి తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇది ప్రభుత్వ పనితీరు అని చెప్పుకోవడం కంటే ఇది మా పార్టీ ప్రచార హోరు అని చెప్పినట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. పైగా కలిసిన వారినల్లా బలవంతంగా మాకు అనుకూలంగా ఎస్ఎంఎస్ చేయండి, నువ్వే మా నమ్మకం జగనన్న పార్టీ స్టిక్కర్ను మీ ఇళ్లకు అంటించుకోండి అని బలవంతం చేయడం పై ప్రజల్లో కొంత ఏహ్య భావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వ ప్రతినిధులైన మంత్రులకు ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములైన ఎమ్మెల్యేలకు సహజంగానే సానుకూలత ఏర్పడుతుంది. కానీ మేము మీకు ఇది చేసాం అంటూ పదేపదే వారి ముందు తిరుగుతూ వైఫల్యాలను మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ద్వారా జగన్ ప్రభుత్వ పరమావధి మరో ఎన్నిక గెలవడం మాత్రమే కానీ ప్రజాసేవ కాదు అని చెప్పకనే చెబుతున్నారు.

లోకేష్ "సెల్పీ" కాన్ఫిడెన్స్

మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలను లేవనెత్తడంలోనూ నేరుగా ప్రజల్లో మమేకమవుతూ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ, ప్రజా మద్దతు కోరడంలోనూ దూసుకుపోతుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూపిస్తూ.. ఇప్పుడు ప్రజల అందుకుంటున్న వాటి ఫలితాలను సాక్షాదారులతో వివరిస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ప్రచారం చాలా సానుకూలంగా ఉంది. లోకేష్ చేస్తున్న పాదయాత్రలో ఇప్పటికే రెండు జిల్లాల్లోని ప్రధాన అభివృద్ధి పథకాలను స్పష్టంగా ప్రజలకు చూపించగలిగింది. చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ ద్వారా ఏర్పడిన పరిశ్రమలు, ఎంతమందికి ఉపాధిని అందించింది. కియా కార్ల పరిశ్రమను వ్యతిరేకించిన వైసిపి ఇప్పుడు ఆ పరిశ్రమ ద్వారా ఎంత మంది ఉపాధి పొందుతున్నారు అన్నదానికి నిదర్శనాలు ..లోకేష్ సెల్ఫీలతో అదరగొడుతున్నారు. మా అభివృద్ధికి నిదర్శనం ఈ ఫోటో అంటూ జగన్ మోహన్ రెడ్డికి సెల్ఫీ సవాల్ విసురుతున్నారు. నువ్వేం చేసావో చెప్పు ఐదేళ్ల మా పాలనలో జరిగిన అభివృద్ధి కళ్లారా చూడు అంటూ ట్విట్టర్లో ప్రశ్నిస్తున్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో తమ ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ పరిశ్రమలకు డ్యూటీ కి వెళ్తున్న ఉద్యోగులను వారి బస్సులోకి ఎక్కి మరి పలకరించి వారితో దిగిన సెల్ఫీతో ఇప్పుడు ఏమంటావ్ జగన్ అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా వాహనాలకు రుణాలు పొంది ఇప్పుడు స్థిరమైన ఆదాయం పొందుతున్న దళిత సోదరులతో ఫోటో దిగి ఇలాంటి అభివృద్ధి నువ్వు చేసి చూపించావా.... వట్టి మాటలు చెప్పడం మానకో జగన్కు చురకలు అంటించారు లోకేష్.

మొత్తంగా చూస్తే ప్రజా సమస్యలను లేవనెత్తుతూ తమ హయాంలో జరిగిన అభివృద్ధికి సాక్షాలు చూపుతూ.. నువ్విలా చేయగలవా అని సవాలు విసురుతున్న చంద్రబాబు లొకేష్ ముందు ఏమీ చేయకుండానే చేశామని పదేపదే డబ్బా కొట్టుకునే జగన్ స్టిక్కర్ బ్రాండింగ్ వెల వెల పోతోంది.

Tags

Read MoreRead Less
Next Story