AP: జోరుగా సాగుతున్న ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా పాల్గొంటున్నారు. తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత... కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని... నేతలు భరోసా ఇస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ.... ప్రజలకు చేరువవుతున్నారు. శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గొండు శంకర్ నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి... మహిళలు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ... కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని గొండు శంకర్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఈశ్వరరావు రణస్థలం మండలంలో ఇంటింటి ప్రచారం చేశారు. రోడ్‌షో నిర్వహించి కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో... కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ భవన నిర్మాణ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామానికి చెందిన కొంత మంది భవన నిర్మాణ కార్మికులు జనసేనలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసాపురం మండలంలోని దర్శరేవు, రాజులంకలో ఇంటింటికి తిరిగారు. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి MLA అభ్యర్థిగా తనను.... కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాసవర్మను గెలింపించాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి- సంక్షేమం కలబోతగా ప్రకటించిన కూటమి మేనిఫెస్టోతో వైకాపా ఓటమి ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. వైకాపా అభ్యర్థి దేవనేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్‌లో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ... ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. కృష్ణాజిల్లా గుడివాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా N.T.R. కుమారుడు నందమూరి రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, M.L.A. అభ్యర్థిగా వెనిగండ్ల రామును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్తుందని బాపట్ల జిల్లా వేమూరు కూటమి అభ్యర్థి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు మండలంలో ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ కూటమి అభ్యర్థి శ్యామ్‌బాబు వెల్దుర్తి మండలంలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్‌ను గద్దె దించాలని ఓటర్లను కోరారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌరు చరిత గడివేముల మండలం చిందుకూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com