AP: ఏపీలో ఓటర్ల జాబితా ఆక్రమాలపై ఈసీ ఆరా
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షా సమావేశాలు నిర్వహించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి చేరుకున్న ఈసీ బృందం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఓటర్ల జాబితా అంశం సహా ఎన్నికల సన్నాహాలపై కూలంకషంగా చర్చించింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలపై.. ఈసీ గతంలో ఫిర్యాదులు తీసుకుంది. ఆ ఫిర్యాదులపై కలెక్టర్లు తీసుకున్న చర్యలపై చర్చించింది. క్షేత్రస్థాయి స్థితిగతులపై అధికారుల నుంచి సమగ్ర వివరాలు సేకరించింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల అధికారుల బృందానికి అందించారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితాతోపాటు...పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, ఇతర అంశాలను తెలియజేశారు. ఓటర్ జాబితాపై వచ్చిన దరఖాస్తులన్నీ దాదాపు పరిష్కరించామని ముఖేష్ కుమార్ మీనా వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌ల ఓటర్ల జాబితా వంద శాతం స్వచ్ఛత ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృంద సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఎన్నికల్లో ఓటర్ల పూర్తిస్థాయి భాగస్వామ్యం ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు మూలమని విజయవాడలో నిర్వహిస్తున్న రెండు రోజుల సమీక్ష సమావేశాల సందర్భంగా పేర్కొన్నారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. స్వీప్ కార్యక్రమాలను క్రియాశీలంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే సజావుగా ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని... ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియను సజావుగా, విజయవంతంగా ఎలాంటి అవరోధాలు లేకుడా పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణళిక అవసరమని అన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితాతో పాటు సమర్థ, సుశిక్షితులైన మానవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని.. ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్‌కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, వోటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్‌లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థవంత మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి సరైన విధంగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ఐటీ వేదికలు దోహదం చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రివెంటివ్ చర్యలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com