AP: ఉప ఎన్నికల అక్రమాల్లో పోలీసులు

AP: ఉప ఎన్నికల అక్రమాల్లో పోలీసులు
X
ఇద్దరు సీఐలు, ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెండ్‌... వీఆర్‌కి మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల అక్రమాలు తవ్వకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. దొంగ ఓటర్లే కాదు.. ఈ నకిలీ ఓట్ల దందాలో పోలీసుల ప్రమేయమూ బయటపడింది. జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారు. ఈ సంఘటనలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు వేయించడంతో పోలీసుల నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్‌ S.H.O.గా పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌ బీవీ శివప్రసాద్‌రెడ్డి, ఎస్సై ఏ.జయస్వాములు, హెడ్‌ కానిస్టేబుల్‌ కె.ద్వారకానాథ్‌రెడ్డి.. తిరుపతి పశ్చిమ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ సస్పెండయ్యారు. ఈ మేరకు అనంతపురం డీఐజీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అలిపిరి పోలీసుస్టేషన్‌లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సీఐలుగా పనిచేసిన అబ్బన్న, దేవేంద్రకుమార్‌లను వీఆర్‌కు పంపించారు.


కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలు జరిగితే.. సూత్రధారులైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారితోనే అంటకాగి కేసులకు సమాధి కట్టేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగ లాగితే డొంక బయటపడుతుందన్న దురుద్దేశంతో కేసుల్లో తొలుతే తీగ తెంపేశారు. దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డ వారిని విచారించటం మాట అటుంచి కనీసం వారి వద్దనున్న పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఉపఎన్నికల సందర్భంగా ఈఆర్వో లాగిన్, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేయించటం, ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారికి కార్డులు, ఓటర్లు స్లిప్పులనిచ్చి దొంగ ఓట్లు వేయించటం, అలా ఓటేస్తూ ఎవరైనా పట్టుబడి కేసు నమోదైనప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయకుండా మూసేయించటంలో అధికార పార్టీ నాయకుల నేరపూరిత కుట్ర కళ్లకుకడుతోంది.

దొంగ ఓట్ల దందాను నడిపించారని ప్రతిపక్షాల ఆరోపణలు, ఫిర్యాదులను ఎదుర్కొంటున్న తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల జోలికి ఎన్నికల సంఘం వెళ్లకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి వైసీపీతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల ఆదేశాలే చట్టమన్నట్టుగా పనిచేస్తారన్న విమర్శలున్నాయి. వైసీపీ కోసం అంతలా పనిచేసే ఆయనే.. చివరికి దొంగ ఓట్ల కేసులను నీరుగార్చిన తన సిబ్బందిపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తిందని చర్చించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సీరియస్‌గా దృష్టి సారించటంతో తప్పనిసరై బాధ్యులపై ఆయన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

Tags

Next Story