AP: ఏపీ డీజీపీపై వేటు

AP: ఏపీ డీజీపీపై వేటు
తక్షణమే బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశం...తగిన మూల్యం చెల్లించుకుంటున్న వైసీపీతో అంటకాగిన నేతలు....

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి అంటకాగుతున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. D.G.P రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. DGP ని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. విపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశించింది. జగన్ భక్త అధికారిగా ముద్రపడిన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తక్షణమే రిలీవ్‌ కావాలని ఆదేశించింది రేపు ఉదయం 11లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని సీఎస్‌ జవహర్‌ రెడ్డిని ఈసీ ఆదేశించింది. వీరందరికీ సంబంధించిన ఐదేళ్ల పనితీరు నివేదిక, విజిలెన్సు క్లియరెన్సు నివేదికల్ని కూడా కమిషన్‌కు పంపించాల్సిందిగా సూచించింది. డీజీపీకి ఎన్నికల విధులు అప్పగించొద్దని... సీఎస్‌కు ఈసీ ఆదేశించింది.

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వైసీపీకి కొమ్ముకాస్తున్నారని... గత కొంతకాలంగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో తనపై జరిగిన దాడిపై అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరుగుతున్నా పోలీసులు పక్కనే ఉండి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. దీనిపై SP కి ఫిర్యాదు చేసినా సరైన సమయానికి తగిన బలగాలను పంపలేదని ఫిర్యాదులో ప్రస్తావించారు. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి అసమర్థతే పోలీసుల నిర్లక్ష్యానికి కారణమని ఆయన ఆరోపించారు. డీజీపీ ముఖ్యమంత్రికి బంధువని అందుకే విపక్షాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగవని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. డీజీపీని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆయన ఈసీని కోరారు.

ఇన్‌ఛార్జి డీజీపీగా వ్యవహరిస్తున్న కేవీ రాజేంద్రనాథరెడ్డి తొలి నుంచి వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టీకాలు జరుగుతున్నా ఆయన ఏ రోజూ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించారనే వాదనలు వినిపించాయి. తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్ట్‌లు చేయించారని ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినవారి గొంతులు నొక్కారనే విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారినీ కేసులతో వేధించారని విపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలునిచ్చినా గృహ నిర్బంధాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీల్లో ఎంత ముఖ్యనేతలు వెళ్లినా ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదనే వాదనలు వినిపించాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాతే విపక్ష నేతలకు ఆయన దర్శనభాగ్యం కలిగింది. మాచర్లలో వైసీపీ నాయకులు విధ్వంసానికి దిగి, టీడీపీ నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పంటించి దమనకాండకు పాల్పడితే వాళ్లనే వెనకేసుకొస్తూ ప్రతిపక్షానిదే తప్పన్నట్టుగా మాట్లాడారనే విమర్శలు ఉన్నాయి.

డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కనపెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జీ డీజీపీగా నియమించిన జగన్‌ ప్రభుత్వం...... రెండేళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగించింది. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాస్తున్నా...... ప్రభుత్వం ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. వడ్డించే వాడు మనవాడైతే అన్నట్లుగా.. సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా పదవి వరించింది. 1992 బ్యాచ్‌ అధికారైన ఆయన అదనపు డీజీపీ నుంచి డీజీపీ హోదాకి పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే...పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా ఉన్న గౌతమ్‌సవాంగ్‌ను ఆకస్మికంగా, అర్ధంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి.. ఆ స్థానంలో ఇన్‌ఛార్జి డీజీపీగా కేవీ రాజేంద్రనాథరెడ్డిని నియమించిన జగన్‌ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది.

Tags

Read MoreRead Less
Next Story