AP PRC: పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆగ్రహం.. చర్చకు వచ్చేదే లేదంటూ..

AP PRC: పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆగ్రహం.. చర్చకు వచ్చేదే లేదంటూ..
AP PRC: జీవోలపై వెనక్కు తగ్గేవరకు చర్చలకు వచ్చేది లేదని మొహమాటం లేకుండా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి

AP PRC: పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు భీష్మించారు. జీవోలపై వెనక్కు తగ్గేవరకు చర్చలకు వచ్చేది లేదని మొహమాటం లేకుండా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా మా డిమాండ్లు తీర్చిండి అప్పుడు చర్చలకు వస్తామని మోహంమీదనే చెప్పేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా తగ్గేదేలే అంటున్నారు. జగన్‌ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించారు.

చర్చలకు రావాలన్న మంత్రుల కమిటీ ఆహ్మానం నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ నేతలు ఆస్కార్‌ రావు, వైవీ రావు, హృదయరాజు, శివారెడ్డి తదితరులు సచివాలయానికి వెళ్లారు. మంత్రుల కమిటీకి తమ నిరసన లేఖ అందజేశారు. పీఆర్సీల జీవోల రద్దు, ఉద్యోగులకు పాత జీతాల చెల్లింపు, పీఆర్సీపై అశుతోష్‌ మిశ్రా నివేదికను బయటపెట్టాలనే మూడు ప్రధాన డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. చర్చల కోసం రాలేదని మంత్రుల కమిటీకి తేల్చి చెప్పారు.

మూడు ప్రధానాంశాలను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని మంత్రుల కమిటీకి స్పష్టం చేసినట్లు స్టీరింగ్‌ కమిటీ నేతలు తెలిపారు. ముఖ్యమైన మూడు డిమాండ్స్‌ను మంత్రుల కమిటీకి చెప్పామని, వాటిమీద ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి చర్చలకు రావాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందన్నారు. సీఎస్‌తో చర్చించి మరోసారి మాట్లాడుకుందామని మంత్రులు, సజ్జల చెప్పారన్నారు.

ఉద్యోగ సంఘాలతో చర్చకు వేచిచూస్తున్న మంత్రుల కమిటీ.. ఈనెల 27న మరోసారి చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరింది. ఉద్యోగ సంఘాల నేతలు ఆలస్యంగా వచ్చినా మంత్రుల కమిటీ వేచి చూసినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడు పాయింట్లతో ఉద్యోగ సంఘాలు లేఖలు ఇచ్చాయని, జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు. మొత్తానికి చర్చలపై ప్రభుత్వానికి ఉద్యోగులు షాక్‌ ఇచ్చారు. సమరానికే సై అంటున్నాయి. పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకుంటేనే చర్చలని తేల్చి చెప్పాయి.

Tags

Read MoreRead Less
Next Story