BABU ARREST: స్కిల్‌ కేసు పూర్తిగా నిరధారమే: సుమన్‌బోస్‌

BABU ARREST: స్కిల్‌ కేసు పూర్తిగా నిరధారమే: సుమన్‌బోస్‌
సీమెన్స్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ బోగస్‌ అన్న మాజీ ఎండీ... అన్ని విషయాలు కోర్టుకు చెప్తామని వెల్లడి...

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైందని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టం చేశారు. శిక్షణ తర్వాత 2.32 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని... స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వంద శాతం విజయవంతమైన ప్రాజెక్ట్ అని వెల్లడించారు. స్కిల్ ప్రాజెక్టును గతంలో మెచ్చుకున్న A.P.S.S.D.C.నే ఇప్పుడు బోగన్ అని ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని సుమన్ బోస్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వివరాలను ఆయన దిల్లీ నుంచి వివరించారు. బిల్డ్ - ఆపరేట్ - ట్రాన్స్ ఫర్ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నడిచిందన్న సుమన్ బోస్ 2021లో ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేశామని వెల్లడించారు. 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఒక్క శిక్షణ కేంద్రాన్ని కూడా సందర్శించకుండానే అక్రమాలు జరిగాయని ఆరోపించారని సుమన్ బోస్ ఆక్షేపించారు.

2016లో విజయవంతమైన ప్రాజెక్ట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని వెల్లడించారు. ప్రాజెక్ట్ అందించిన ఫలితాలు చూసి మాట్లాడాలని అన్నారు. విజయవంతమైన ప్రాజెక్ట్‌ని బోగస్ అనడం సరికాదని అన్నారు. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని, కోర్టులకు అన్ని వివరాలు చెబుతామని సుమన్ బోస్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని తేల్చి చెప్పారు.

ఈ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి లేదని, అన్ని అధ్యయనం చేసిన తరువాత ఈ ప్రాజెక్టు ప్రారంభించామని సుమన్ బోస్ వివరించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా? అని ఆయన ప్రశ్నించారు. మనీ లాండరింగ్ జరగలేదని, సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి మధ్య ఒప్పందం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి కోర్టులకు అన్ని విషయాలు చెబుతామని క్లారిటీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story