CM Jagan : సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌పై నేడు తుది తీర్పు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై గత నెల ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశారు. ఈ పిటిషన్లపై తీర్పును ఇవాళ వెల్లడించనుంది సీబీఐ కోర్టు. తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ ఏపీలో ఏర్పడింది. అటు.. వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది.
సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి. తర్వాత కోర్టు విచారణకు స్వీకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు.
సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కావడం లేదని సీబీఐ కోర్టుకు వివరించారు. సీఎం జగన్‌పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని కోరారు. పిటీషన్‌లో సీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు.
అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ వేయడానికి నిరాకరించింది. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలంటూ సీబీఐ కోర్టుకే చాయిస్ వదిలేసింది. సీఎం జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజాయిండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారానికే వదిలేస్తున్నామని తెలిపారు.
బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజాయిండర్లో పేర్కొన్నారు. దీంతో జగన్, రఘురామరాజు తరపు న్యాయవాదులు మాత్రం వాదనలు వినిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com