Godavari: చరిత్ర తిరగరాసిన గోదావరి.. 32 ఏళ్ల తరువాత ఇలా..

Godavari: చరిత్ర తిరగరాసిన గోదావరి.. 32 ఏళ్ల తరువాత ఇలా..
Godavari: గోదావరి వరద చరిత్ర తిరగరాసింది. 32 ఏళ్ల తరువాత మహోగ్రరూపం దాల్చింది.

Godavari: గోదావరి వరద చరిత్ర తిరగరాసింది. 32 ఏళ్ల తరువాత మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహ ధాటికి కోనసీమ జిల్లాలోని లంకప్రాంతాలు తల్లడిల్లుపోతున్నాయి. కోనసీమ జిల్లాలో దాదాపు లక్షమంది బాధితులు నరక యాతన పడుతున్నారు. గోదావరిని ఆనుకుని ఉన్న 45కి పైగా లంకగ్రామాల్లో వరద 18 అడుగుల నుంచి 25 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వందలాది గ్రామాలు నీట మునిగాయి. అయినవల్లి, కాట్రేనికోన, ఐ.పోలవరం, మామిడికుదురు, ఉప్పలగుప్తం, రావులపాలెం, కపిలేశ్వరపురం తదితర మండలాల్లో అసలు ఏ లంక ఎలా ఉందో అధికారులకు తెలియడం లేదు.

పి.గన్నవరం నియోజకవర్గంలో వశిష్ట, వైనతేయ, గౌతమి పాయలు భీకరంగా మారాయి. పి.గన్నవరం పాత అక్విడెక్టు వద్ద వైనతేయ నది ప్రవాహం భయపెడుతోంది. తొట్టెను ముంచేసిన వరద నీరు.. పాత బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. పి.గన్నవరం మండలం‌లోని ఊడిమూడిలంక, బూరుగులంక, గంటిపెదపూడి లంక, అరిగెలవారిపేట గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నదీపాయలు, కాజ్ వేల వద్ద వరద ఉధృతి భీకరంగా ఉంది. దీంతో లంక గ్రామాల్లో పడవలపై ప్రయాణం సాహసమనే చెప్పాలి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

అయినవిల్లి మండలం పొట్టిలంక, కొండుకుదురు లంక పూర్తిగా వరదనీటిలో చిక్కుకున్నాయి. నిత్యావసరాలకు, మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పి.గన్నవరంలో పలుచోట్ల ఇళ్లల్లో సామాన్లను డాబాలపైకి ఎక్కించి అక్కడే తలదాచుకొంటున్నారు. ప్రమాదం అని తెలిసినా సరే.. లంక రైతులు అందినకాడికి బొప్పాయి, గుమ్మడి, మునగ పంటలను పడవలపై వెళ్లి.. కాయలు కోసి ఏటిగట్టుకు చేర్చుకొంటున్నారు. కొన్నిచోట్ల లంక పొలాల్లోనే పశువులు ఉండిపోయాయి. రైతులు అక్కడికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో పాడి పశువులు ఆకలితో అల్లాడిపోతున్నాయి.

లంక గ్రామాల నుంచి లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కోనసీమ జిల్లాలో గోదావరి అత్యంత ఉగ్రరూపం దాల్చింది. అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద కుడి కాలువలోకి వరదనీరు ఎగజిమ్ముతోంది. ఇక్కడ గనక గండి పడితే ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో అపార నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడికి స్థానికులు ఎవరూ రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. అక్విడేట్ కుడిగట్టు లీక్‌ అవుతుండడంతో.. వరదనీరు బయటికొస్తోంది. కోనసీమ జిల్లాలో 18 మండలాల్లో 59 వరద ప్రభావిత గ్రామాలు ఉంటే.. ఇప్పటికే 37 లంకల్లోకి వరద చేరింది.

73 పునరావాస కేంద్రాల్లో 20 వేల మందికి వసతులు సమకూర్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇళ్లు ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్తే చోరీలు జరగవచ్చనే భయంతో ఖాళీ చేయడానికి చాలామంది ముందుకు రావడంలేదు. పునరావాస కేంద్రాలకు వచ్చిన కుటుంబాలకు 2 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఫలితం లేకపోయింది. లంక గ్రామాల్లో ముంపు బాధితులకు తినడానికి తిండి లేదు. తలదాచుకోవడానికి చోటు లేదు. ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇళ్లల్లోని సామగ్రి గోదావరి పాలైంది.

పంటలు నీట మునిగాయి. కొట్టుకుపోగా మిగిలిన సామగ్రి, కోళ్లు, పశువులను వెంట బెట్టుకుని బాధితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. కోనసీమ జిల్లాలో తీరానికి ఆనుకుని ఉన్న వందకుపైగా లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. సర్కారు కనీసం పట్టించుకోకపోవడంతో వేలాది మంది బాధితులు హాహాకారాలు చేస్తున్నారు.

వరద ముప్పు నాలుగు రోజులుగా కొనసాగుతున్నా ఇప్పటికీ 8 మండలాల్లో లంక గ్రామాలకు అధికారుల జాడే లేదు. ఉన్న సిబ్బంది పెద్దగా సమస్యల్లేని లంకగ్రామాల్లో సహాయక చర్యలపైనే దృష్టిసారిస్తున్నారు. దీంతో బాధిత గ్రామాల్లో ప్రజలు తిండి, నీటికి అల్లాడుతున్నారు. చీకటైతే అంధకారంలో మగ్గుతున్నారు. ప్రభుత్వ సాయం అందుతుందనే నమ్మకం లేక పడవలపై వెళ్లి నిత్యావసరాలు, నీళ్లు తెచ్చుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story