Atchannaidu : యూరియా సహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం - మంత్రి అచ్చెన్నాయుడు

యూరియా సహా రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై శాసనసభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు.
వైసీపీపై విమర్శల దాడి. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే దానిని సాకుగా చూపి సభకు రాకుండా ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే విధంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నందునే వై.ఎస్. జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని సొంత మీడియా ద్వారా ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా జగన్ పనికిరారని ప్రజలు భావించారని, అందుకే ఆయనను పక్కన పెట్టారని గోరంట్ల అన్నారు.
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా లేదనే సాకుతో అసెంబ్లీకి రాకపోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుని రైతులకు అండగా నిలబడ్డామని చెప్పారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వైద్య కళాశాలల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు ఇక నమ్మే స్థితిలో లేరని ఆమె స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com