Gudlavalleru : ఆమె అల్లిన కథ ‘గుడ్లవల్లేరు’

Gudlavalleru : ఆమె అల్లిన కథ ‘గుడ్లవల్లేరు’
X
అది మొత్తం సృష్టే.. అసలు నిజం ఏంటంటే

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‎గా తీసుకుని విచారణ చేపట్టింది. ఇందులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో అసలు ఏం జరిగింది? విద్యార్థినులు ఎందుకు అంతలా ఆందోళన చెందారు? హిడెన్ కెమెరా ద్వారా పెద్ద ఎత్తున వీడియోలు లీక్ అయ్యాయనే ప్రచారం ఎలా మొదలైంది? ఇందులో ఎంతవరకు నిజం ఉంది?. ఇలా అన్నిఅంశాలపై పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. ఒక అమ్మాయి హిడెన్‌ కెమెరాలతో హాస్టల్‌ విద్యార్థినుల నగ్న వీడియోలు రికార్డు చేసి హాస్టల్‌లోని అబ్బాయిలకు విక్రయిస్తున్నట్లు పుట్టించిన వార్తల్లో నిజాలు నిగ్గుతేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముగ్గురు ఐజీలు జీవీజీ అశోక్‌కుమార్‌ , పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం. రవిప్రకాశ్‌తో కూడిన బృందాన్ని రంగంలోకి దించింది. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అసలు హిడెన్ కెమెరాలే లేవని, కేవలం విజయ్ ప్రియురాలు సృష్టించిన పుకార్లేనన్న విషయం బయటకు వచ్చింది.

గుడ్లవల్లేరుకు నిపుణుల బృందం

దేశంలోనే ప్రతిష్టాత్మక టెక్నికల్‌ సంస్థ సెర్ట్‌ (కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌) డైరెక్టర్‌ సంజయ్‌ బాహ్ల్‌ నేతృత్వంలో పుణెలోని సీ-డాక్‌ నుంచి నిపుణుల బృందం గుడ్లవల్లేరుకు చేరుకుని విద్యార్థి నాయకులు, కళాశాల సిబ్బంది సమక్షంలో హాస్టల్‌లోని స్నానాల గదుల్లోని ఎలక్టికల్‌, ప్లంబింగ్‌ పరికరాలన్నీ స్పై డిటెక్టర్లతో పరిశీలించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోపాటు మరో ఇద్దరు అబ్బాయిల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ప్రచారంలో నిజాల్లేవని నిపుణులు, పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కేవలం నలుగురు విద్యార్థుల వివాదమే ఇంతటి వివాదానికి కారణంగా పోలీసు ఉన్నతాధికారులు పసిగట్టినట్లు సమాచారం.

అసలేం జరిగింది

అమ్మాయిలను వలలో వేసుకుని వారితో న్యూడ్‌ కాల్స్‌ రికార్డు చేసే ఇంజనీరింగ్‌ విద్యార్థి ఒకడు... ప్రియుడితో హోటల్‌ గదులకు వెళ్లే ప్రియురాలు మరొకరు.. ఆమె వన్‌సైడ్‌ ప్రేమికుడు ఇంకొకడు... చెల్లిని మోసం చేసిన స్నేహితుడి అంతు చూడాలనుకున్న విద్యార్థి వేరోకడు... ఇలా ఈ నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి రావు ఇంజనీరింగ్‌ కాలేజీలో వివాదానికి కారణమని నిపుణులు, పోలీసులు దాదాపు ఒక నిర్దారణకు వచ్చారు.

విజయ్‌ అనే విద్యార్థికి అదే కళాశాలలో మరో విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేసుకునేవారు. అయితే ప్రియురాలికి తెలియకుండా విజయ్‌ వాటిని రికార్డు చేశాడు. విజయ్‌ స్నేహితుడు ఒకరోజు ఫోన్‌ చూస్తుండగా అందులో అమ్మాయిల న్యూడ్ వీడియోలు కనిపించాయి. వెంటనే విజయ్‌ ప్రేమికురాలిని ప్రేమిస్తున్న వ్యక్తికి ఈ విషయాన్ని చేరవేశాడు. ఆ విద్యార్థి ఇదేమిటని ప్రశ్నించడంతో ఆమె విజయ్‌ని నిలదీసింది. తన స్నేహితుడే దీనికి కారణమని తెలుసుకున్న విజయ్‌ నీ చెల్లి వీడియోలు కూడా ఉన్నాయి. కాలేజీలో అందరికీ పంపుతా అని బెదిరించాడు. దీంతో విజయ్‌ స్నేహితుడు వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్‌ పిలిచి విచారించగా ఏడెనిమిది ఫొటోలు బయటికి వచ్చాయి. అందరినీ హెచ్చరించి వివాదాన్ని మూసేశారు. ఇటీవల అదే యువతితో విజయ్‌ ఉన్న మరో వీడియో వెలుగులోకి రావడంతో ఆమె స్నేహితురాళ్లు ఇదేమిటని అడిగారు.

నా వీడియో రావడంతో .. బెదిరించా

అసలు వషయం చెప్పకుండా విజయ్‌ ప్రియురాలు.. నావే కాదు.. మీవి కూడా ఉన్నాయ్‌.. మీ వాష్‌ రూమ్‌ల్లో నేనే రహస్య కెమెరాలు పెట్టి రికార్డు చేశా.. అని బదులిచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హాస్టల్‌ విద్యార్థినిలు ఒకరికొకరు ఆరా తీసే క్రమంలో విషయం కళాశాల బయటికి వచ్చింది. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన ఐజీలు.. ఎవ్వరిని అడిగినా వీడియోల్లేవని చెప్పారు. రహస్య కెమెరాల ప్రచారం ఎలా వ్యాప్తి చెందిందని ఆరా తీయగా.. విజయ్‌ ప్రియురాలే చెప్పిందని బదులిచ్చారు. ఆమెను ప్రశ్నించగా నా వీడియో గురించి అడగడంతో మీవి కూడా ఉన్నాయని బెదిరించానంది. కళాశాలలోని వై-ఫై రూటర్లన్నీ నిపుణుల బృందంతో డీకోడ్ చేయిస్తున్నారు. అందులోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. పోలీసు శాఖ మరో వారం రోజుల్లో మొత్తం నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయం పై స్పందించింది.

Tags

Next Story