AP: విశాఖలో వైసీపీకి భారీ షాక్‌.. మేయర్‌ పీఠంపై కూటమి కన్ను

AP: విశాఖలో వైసీపీకి భారీ షాక్‌.. మేయర్‌ పీఠంపై కూటమి కన్ను
టీడీపీ, జనసేనలో చేరిన 12మంది కార్పొరేటర్లు... మరికొందరు చేరుతారన్న ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవీఎంసీ కార్పొరేటర్లు 12 మంది ఆ పార్టీని వీడి, ఏడుగురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో అయిదుగురు కార్పొరేటర్‌లు జనసేనలో చేరారు. కార్పొరేటర్లు చేజారిపోకుండా వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారితో మాజీ మంత్రి అమర్‌నాథ్‌ సమావేశమై.. పార్టీని వీడి వెళ్లొద్దని కోరినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వ ప్రజా విధానాలు నచ్చడం.. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీలతో గెలిపించి వైసీపీని ఘోరంగా ఓడించడంతో జగన్‌ పార్టీని వీడినట్లు కార్పొరేటర్లు తెలిపారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల నడుమ సందడిగా చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా కార్పొరేటర్లకు కండువాలు కప్పి కూటమి పార్టీల్లోకి ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తామని ప్రతినబూనారు. గత వైసీపీ ప్రభుత్వం టీడీపీకి చెందిన వారిపై అనేక రకాలుగా ఒత్తిళ్లు తెచ్చి, ఆ పార్టీలో చేర్చుకుందని పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు తాము ఎవరిపైనా అటువంటి ఒత్తిళ్లు తేలేదని, కొత్త వారి రాకతో టీడీపీలో ఉన్న పాతవారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు. విశాఖ నగర అభివృద్ధే తమ ధ్యేయమని, అందుకు వివాదరహితులైన వైకాపా కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకున్నామని వెల్లడించారు. కార్పొరేషన్‌లో మేయర్‌ను తొలగించడంపై త్వరలో నిర్ణయం ఉంటుందని చెప్పారు.

25వ డివిజన్‌ కార్పొరేటర్‌ సారిపల్లి గోవిందరాజుల వెంకట అప్పారావు, 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ కంపా హనోక్‌ 65వ డివిజన్‌ కార్పొరేటర్‌ బి.నరసింహపాత్రుడు , 71వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాజాన రామారావు, 85వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇళ్లపు వరలక్ష్మి, 8వ డివిజన్‌ కార్పొరేటర్ లొడగల అప్పారావు, 30వ డివిజన్‌ కార్పొరేటర్‌ కోడూరు అప్పలరత్నం తెలుగుదేశం పార్టీలో చేరారు. 42వ డివిజన్‌ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ పి.ఉషశ్రీ, 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ కె.కామేశ్వరి, 59వ డివిజన్‌ కార్పొరేటర్‌ పూర్ణశ్రీ, 77వ డివిజన్‌ కార్పొరేటర్‌ బి.సూర్యకుమారి జనసేనలో చేరారు. త్వరలో మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో కూటమి పార్టీలు స్థాయీ సంఘాల ఎన్నికతో పాటు మేయర్‌ పీఠంపై కన్నేశాయి. తాజా చేరికలతో కార్పొరేషన్‌లో మొత్తం 97 మంది కార్పొరేటర్లలో కూటమి పార్టీల బలం 45కి చేరింది. వైసీపీ బలం 50కి పడిపోయింది.

Tags

Next Story