AP: తడిసి ముద్దయిన ఆంధ్రప్రదేశ్

ఎడతెరపిలేని వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దయింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్ని ముంచేశాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు సహా పలు పట్టణాలు జలదిగ్బంధంలోకి చేరాయి. ఉరుములు, మెరుపులతో మురిసిన అత్యంత భారీవర్షాలకు వాగులు, వంకలు ఏకమవ్వడంతో.. పంటపొలాలు, పల్లెలు చెరువుల్ని తలపించాయి. విజయవాడలో రహదారులపై మూడు నుంచి నాలుగు అడుగులకు పైగా నీరు నిలవడంతో.. ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు కూడా ముందుకు కదల్లేకపోయాయి. అత్యవసర పని ఉంటే తప్ప.. ద్విచక్ర వాహనదారులెవరూ రోడ్డుమీదకు రావద్దని అధికారులు ప్రకటించారు. విజయవాడ నుంచి గుంటూరు, కంచికచర్ల, విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారులపైకి వరద పోటెత్తడంతో రాకపోకలు స్తంభించాయి.
భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో విజయవాడలో ఆరుగురు మృతిచెందగా.. నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కారు కొట్టుకుపోయి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. కొండచరియలు విరిగిపడి మరో వృద్ధురాలు మరణించారు. సీఎం చంద్రబాబు అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని, భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షి నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు. కొన్నిచోట్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. రాజధాని పరిధిలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ప్రాంతంలో గంటకు 6 సెం.మీ వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాలలో శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య 22.15 సెం.మీ. వర్షం కురిసింది. - విజయవాడలో శనివారం ఉదయం నుంచి రాత్రి 7గంటల మధ్య 10.65 సెం.మీ. వర్షం కురవగా.. ముందురోజు కూడా కలిపితే మొత్తం 27.4 సెం.మీ. నమోదైంది. 10 గంటల్లోనే 16 సెం.మీ. కురిసింది.
పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట జైల్‌సింగ్ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. అచ్చంపేట విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో వర్షపునీరు చేరడంతో.. సరఫరా నిలిపేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు చెరువు పొంగడంతో గ్రామంలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిలో రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద రహదారిపై నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గత 20 ఏళ్లలో ఇంతటి వరద బీభత్సం ఎన్నడూ చూడలేదని విజయవాడలో పలువురు పేర్కొన్నారు. యనమలకుదురులో కొండచరియలు పడి 20 మేకలు, గొర్రెలు మృతిచెందాయి. కట్టలేరు, మున్నేరు, కీసర పొంగి ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com