Andhra Pradesh : ఏపీలో భారీ వర్షాలు: అధికారులతో హోం మంత్రి సమీక్ష

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు హోం మంత్రి అనిత సోమవారం జిల్లాల కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన హాట్‌స్పాట్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అధికారులను కోరారు.
భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com