AP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ హౌస్ అరెస్ట్

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, ఎన్డీయే కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిధున్‌రెడ్డి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారంటూ ఎన్డీయే కార్యకర్తలు రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కూటమి కార్యకర్తలు ప్రతిఘటించారు. తిరిగి వైసీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు. ‘మిథున్‌రెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఇరువర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. అనంతరం ఎంపీని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ముందస్తు సమాచారం లేకుండా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరుకు రావడంతో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోవడంతో ఆయనతో పాటు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మిథున్ రెడ్డి వస్తున్న విషయం తెలియడంతో కొందరు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో వైసీపీ శ్రేణులు రాళ్లు విసరడంతో అసలు గొడవ మొదలైంది. మొదట వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వడంతో.. విషయం పార్టీ శ్రేణులకు తెలపడంతో భారీగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సంయమనం పాటించండి
పుంగనూరులో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతిలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిథున్ రెడ్డి కావాలని రెచ్చగొడుతున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన శ్రేణులు సంయమనం పాటించాలి లేదంటే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని సూచించారు. వైసీపీ, టీడీపీ దాడుల నేపథ్యంలో పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com