AP: పోటెత్తుతున్న వరద.. మునిగిపోతున్న పంట

AP: పోటెత్తుతున్న వరద.. మునిగిపోతున్న పంట
X
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పంట నష్టం.... ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో భారీగా పంటనష్టం సంభవించింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వరద ఉద్ధృతికి వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజికి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వర్షాలు తగ్గినా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7.72 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సోమవారం ఉదయానికి 10 లక్షల క్యూసెక్కులు దాటవచ్చని అధికారులు అంచనా వేశారు. తొలి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో నేటి నుంచి వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోనూ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. తెలంగాణలో కురుస్తున్న వానలతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.


ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరపిలేని వర్షాలకు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. కోనసీమ జిల్లా పి.గన్నవరం, పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక మధ్య కాజ్‌వే మునిగిపోవడంతో పడవలను ఏర్పాటు చేసి రాకపోకలు సాగిస్తున్నారు. గంటిపెదపూడి పరిధిలోనూ పడవలే దిక్కయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రకాలవ, కొవ్వాడ కాలువల్లో వరద కొనసాగుతోంది. కొవ్వాడ కాలువ ఉద్ధృతితో నాలుగు మండలాల్లోని సుమారు 8వేల ఎకరాలు ముంపులో ఉన్నాయి.

ఎర్రకాలువ ప్రభావంతో నిడదవోలు మండలంలో సుమారు 7 వేల ఎకరాల వరి ముంపులో ఉండగా, స్థానికంగా పశుగ్రాసానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీలేరు జలాశయానికి వరద పెరిగింది. గుండవాడ ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రుపల్లి, లైకెన్‌పూర్, గుండవాడ ప్రజలను అప్రమత్తం చేశారు. డుడుమ జలాశయ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని బలిమెలకు విడుదల చేస్తున్నారు. వరద తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

Tags

Next Story