PROTEST: "న్యాయానికి సంకెళ్లు"కు భారీ స్పందన

PROTEST: న్యాయానికి సంకెళ్లుకు భారీ స్పందన
వేలాది సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, టీడీపీ శ్రేణులు

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ఆందోళనలతో తెలుగు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. "న్యాయానికి సంకెళ్లు" పేరుతో చేపట్టిన నిరసనలతో ఏపీ దద్దరిల్లింది. చేతులకు తాళ్లు, రిబ్బన్లతో సంకెళ్లు వేసుకొని రాత్రి 7గంటల నుంచి 7.05 గంటల వరకు టీడీపీ శ్రేణులు, ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అభిమానులు, ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందన్నారు. రాజమండ్రి టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ‘న్యాయానికి సంకెళ్లు’ నిరసనలో నారా భువనేశ్వరి, బుచ్చయ్య చౌదరి, చిన రాజప్ప, కోటేశ్వరరావు, విశాఖలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ పాల్గొన్నారు.


తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు నిరసనలో పాల్గొని.. ‘బాబుతోనే నేను’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టి, ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేసిన 37 రోజులైనా ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. చంద్రబాబు బరువు తగ్గలేదని అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా.. వైద్య నివేదికను అధికారులు ఇవ్వట్లేదన్నారు. అనంతపురంలో చంద్రబాబుకు మద్దతుగా చేతికి సంకెళ్లు వేసుకొని సింగనమల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ బండారు శ్రావణి శ్రీ నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని తన గృహం వద్ద టీడీపీ నేతలతో కలిసి బాబు కోసం మేము సైతం అంటూ ఆందోళనకు దిగారు. చేతులకు నల్ల రిబ్బన్లతో సంకెళ్లు వేసుకొని న్యాయానికి సంకెళ్ల..? అంటూ నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా న్యాయానికి సంకెళ్లు పేరుతో టీడీపీ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. నిరసనలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత పాల్గొన్నారు.


తిరువూరు టౌన్‌లో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము సైతం అంటూ టీడీపీ నేతల ఆధ్యర్యంలో న్యాయానికి సంకెళ్లు నినాదంతో చేతికి తాళ్లతో సంకెళ్లు వేసుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో తిరువూరు బోసు బొమ్మ సెంటర్లో న్యాయనికి సంకెళ్ళు పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నేతలు చేతులకు సంకెళ్ళు వేసుకొని ఏపీలో న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ కొబ్బరికాయలు కొట్టారు.

Tags

Next Story