మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం అంధకారమే.. టీడీపీ అధినేత చంద్రబాబు

మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం అంధకారమే.. టీడీపీ అధినేత చంద్రబాబు

వైసీపీ (ycp) ప్రభుత్వం తిరిగి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ (konaseema) అంబేద్కర్ జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు(chandra babu) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని, రాయితీపై విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

మంచినీళ్లు అడిగితే కొబ్బరినీళ్లు ఇచ్చే ప్రాంతం కోనసీమ అని చంద్రబాబు గుర్తు చేశారు. పంటలకు నీరందించిన బ్రిటిష్ ఇంజనీర్ కాటన్ దొరను ఇప్పటికీ గౌరవిస్తారు. అందరికీ అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ ఇక్కడి నుంచి వచ్చిందని అన్నారు చంద్రబాబు. ఇలాంటి ప్రాంతంలో కాల్వలు బాగుచేయక పంటలు నీట మునిగాయని, పోలవరం అయినా పూర్తయితే జిల్లాకు సాగునీరు వచ్చేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం అగ్రస్థానంలో ఉండేదని, అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఆక్వా సాగు రైతులు నష్టపోయారని అన్నారు.

దళితులకు ఏదో చేశానని జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని, అయితే దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్‌(NTR) నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ అంబేద్కర్‌కు భారతరత్న లభించిందన్నారు. కోనసీమ ప్రాంతానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌గా నియమించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కేఆర్ నారాయణన్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదించింది టీడీపీయేనని అన్నారు.

జగన్ దళిత వ్యతిరేకి అని, దళితుల కోసం అమలులో ఉన్న 27 పథకాలను రద్దు చేశారని చంద్రబాబు అన్నారు. దళితులకు ఖర్చు చేసేందుకు కేటాయించిన రూ.28 వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. జగన్ ముందు ఎవరూ మాట్లాడకూడదని, ప్రశ్నించవద్దని అన్నారు. ఎవరైనా నోరు విప్పితే వారిపై దాడులు చేస్తారని చెప్పారు. పథకం ప్రకారం దళితులను నాశనం చేసిన జగన్. నాడు అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి దళితులను ఉద్ధరిస్తానంటే ఎవరైనా నమ్ముతారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story