AP: పక్కా ప్రణాళికతో ముందుకు సాగండి

AP: పక్కా ప్రణాళికతో ముందుకు సాగండి
సామర్థ్య పరీక్షలు వచ్చాకే స్పష్టత... అమరావతి నిర్మాణాలపై ఐఐటీ నిపుణుల బృందం

అమరావతి రాజధాని ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటించింది. ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను ఐఐటీ నిపుణులు సందర్శించారు. గత ఐదేళ్ల ప్రభుత్వ నిర్లక్యం వల్ల ఐకానిక్ భవనాల పునాదుల్లో నీళ్లు చేరి చెరువును తలపిస్తోంది. ఐకానిక్ సెక్రటేరీయేట్, హెచ్వోడీల నిర్మాణ ప్రాంగణాలను పడవల్లో వెళ్లి ఐఐటీ చెన్నై ఇంజనీర్లు పరిశీలించారు. పునాదుల్లో నీళ్లు ఎప్పటి నుంచి ఉన్నాయని సమాచారం సేకరించారు. పునాదుల్లో మట్టి, కంకర శాంపిల్స్ తీసుకున్నారు. ఇన్నేళ్లూ నీళ్లల్లో పునాదులు ఉండిపోవడంతో భవిష్యత్ నిర్మాణాలకు ఎంత వరకు అనువుగా ఉంటుందని పరిశీలించారు. అమరావతిలోని వివిధ కట్టడాల పటిష్ఠతకు సంబంధించిన సామర్థ్య పరీక్షల ఫలితాలు వచ్చాకే ప్రణాళికతో ముందుకు సాగాలని ఐఐటీ నిపుణుల బృందాలు సీఆర్డీఏకు సూచించాయి. ఈలోపు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపాయి. హైదరాబాద్, మద్రాసు ఐఐటీల నుంచి వచ్చిన నిపుణుల ప్రాథమిక పరిశీలన పూర్తయింది. నిపుణులు సూచించిన పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు త్వరలో ఓ కన్సల్టెన్సీని నియమించనున్నారు. పరీక్షల ఫలితాలను ఐఐటీ బృందాలు అధ్యయనం చేసి సీఆర్డీఏకు నివేదిక ఇవ్వనున్నాయి.


అవసరాన్ని బట్టి ఈ బృందాలు మరికొన్ని సార్లు రాజధానిలో పర్యటించే అవకాశముంది. ఆ బృందాలు రాజధానిలో పరిశీలన అనంతరం.. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌తో సమావేశమయ్యాయి. ఆయన అమరావతి బృహత్‌ ప్రణాళిక, చేపట్టిన నిర్మాణాలను వారికి వివరించారు. తాము గమనించిన అంశాలను కమిషనర్‌కు నిపుణులు వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌తో చర్చిస్తున్న మద్రాస్, హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు

ఐకానిక్‌ భవనాల పునాదుల పరిశీలన రాజధానిలో ఐకానిక్‌ భవనాలుగా నిర్మించతలపెట్టిన సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, హైకోర్టు పునాదుల పటిష్ఠతను మద్రాసు ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ఐదేళ్లుగా నీటిలో నానుతున్న పునాదులను స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ నిపుణుడు మెహర్‌ప్రసాద్, కరోజన్‌ నిపుణుడు రాధాకృష్ణ పిళ్లై, కాంక్రీట్‌ ఫౌండేషన్‌ నిపుణుడు శుభదీప్‌ బెనర్జీ పరిశీలించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పడవలో తిరుగుతూ టవర్ల నిర్మాణాలను చూశారు. ‘ఐదేళ్లుగా సచివాలయ టవర్ల నిర్మాణాలు నీటిలోనే ఉన్నాయి. ఇనుప గడ్డర్లు తుప్పుపట్టాయి. నిర్మాణాల ప్రస్తుత పరిస్థితేంటి? ఎంతమేరకు దెబ్బతిన్నాయి? పునర్వియోగానికి ఏం చేయాలి? అన్న అంశాలపై లోతుగా పరిశీలించాల్సి ఉంది’ అని నిపుణులు సీఆర్డీఏ అధికారులకు చెప్పారు. నీటిపైన, అడుగు భాగంలో నమూనాలను తీసుకుని నాణ్యతను పరీక్షించాల్సి ఉందని వెల్లడించారు.

Tags

Next Story