Polavaram Project: 'జగన్ ప్రభుత్వ అసమర్ధతే పోలవరానికి శాపం'..

Polavaram Project: జగన్ ప్రభుత్వ అసమర్ధతే పోలవరానికి శాపం..
Polavaram Project: పోలవరం ఆలస్యానికి ముమ్మాటికీ జగన్ ప్రభుత్వ అసమర్ధతే కారణమని తేల్చి చెప్పింది హైదరాబాద్‌ ఐఐటీ బృందం.

Polavaram Project: పోలవరం ఆలస్యానికి ముమ్మాటికీ జగన్ ప్రభుత్వ అసమర్ధతే కారణమని తేల్చి చెప్పింది హైదరాబాద్‌ ఐఐటీ బృందం. నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు ఐఐటీ బృందం నివేదిక ఇచ్చింది. సాగుతున్న పనులను అలా కొనసాగించకుండా రివర్స్‌ టెండరింగ్‌ అనే పిచ్చిపని చేయడమే పోలవరం ఆలస్యానికి ప్రధాన కారణమని ముందు నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఐఐటీ హైదరాబాద్ కూడా అదే విషయం చెప్పింది. అసలు పోలవరాన్ని ఎలా పూర్తి చేయాలి అన్న ప్రణాళికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదని, అందుకే నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లోనూ కుండబద్దలు కొట్టింది.

పోలవరం ఆలస్యానికి డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం, దిగువ కాఫర్‌ డ్యాం పైనుంచి భారీ వరద ప్రవహించడం, ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య వరద నిలిచిపోవడం అంటూ జగన్‌ ప్రభుత్వం కారణాలు చెబుతోంది. కాని, వాస్తవం ఏంటంటే.. ఈ పరిస్ధితి రాకముందే ఐఐటీ హైదరాబాద్‌ హెచ్చరికలు, సూచనలతో కూడిన సమగ్ర అధ్యయన నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అందజేసింది. 2021 ఆగస్టు 14న పోలవరానికి వచ్చిన ఐఐటీ బృందం.. అసలేం జరిగింది, ఏం జరుగుతోందన్న దానిపై అధ్యయనం చేసింది. సెప్టెంబరు 29న నిర్వాసితులతో సమావేశమైంది.

ముంపు సమస్య, పునరావాసం, కాలనీల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంది. వీటన్నింటిపై గత ఏడాది నవంబర్‌లోనే పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి 124 పేజీల సుదీర్ఘ రిపోర్టు అందజేసింది. పోలవరం నిర్మాణంలో అత్యంత కీలకమైనవి ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌. దాంతో పాటు లెఫ్ట్ కెనాల్, కనెక్టివిటీ చానళ్లు కూడా నిర్మించాల్సి ఉంది. కాని, నిర్మాణాలు జరక్కపోవడానికి ప్రభుత్వానికి ఒక ప్రణాళికంటూ లేకపోవడం, నిధుల కొరత ప్రధాన కారణాలని ఐఐటీహెచ్‌ తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే స్పిల్‌వే పనులు పూర్తైంది.

ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం వెంటనే దిగువ కాఫర్‌ డ్యాం ఎత్తును 30.5 మీటర్లకు పెంచి ఉంటే.. ప్రాజెక్టు పనులు నిరాటంకంగా సాగేవని ఐఐటీ బృందం అభిప్రాయపడింది. కాని, జగన్ ప్రభుత్వం దిగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచకపోవడం వల్ల 2020లో 22 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మించే ప్రాంతంలోని గ్యాప్‌-1, గ్యాప్‌-2లోకి నీరు చేరింది. ఈ గ్యాప్‌లు రావడానికి భారీ వరదలో, ప్రకృతి వైపరీత్యమో కారణం కాదని, ప్రభుత్వ వైఫల్యమేనని హైదరాబాద్‌ ఐఐటీ బృందం తేల్చి చెప్పింది.

ఎగువ కాఫర్‌ డ్యాంలో నీరు దిగువకు వెళ్లేందుకు వదిలిన రెండు గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడంవల్లే ఈ విధ్వంసం జరిగిందని కుండ బద్దలుకొట్టింది. ఎగువ కాఫర్‌డ్యాం వద్ద ఇసుక కోత తాము అధికారంలోకి రాకముందే ఉందన్నది జగన్‌ ప్రభుత్వం వాదిస్తోంది. కాని, 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. 2020 ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అప్పటివరకు కూడా.. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఉన్న గ్యాప్‌లను పూడ్చలేదు. ఇదే ప్రధాన డ్యాం వద్ద కోతలకు కారణమైందన్న విషయాన్ని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.

అన్నిటికంటే ముఖ్యంగా.. పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి ప్లానింగ్‌ ఉండి ఉంటే.. అనుకున్న లక్ష్యాల ప్రకారం పనులు జరిగేవని, కాని పోలవరంపై ప్రభుత్వానికి ఒక ప్రణాళికంటూ ఉన్నట్టు కనిపించలేదని ఐఐటీ బృందం అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రణాళిక లేని కారణంగా అరకొరగా పనులు జరగడం, నిర్వహణ లోపం, తరచూ డిజైన్లలో మార్పులు, వాటికి విరుద్ధంగా నిర్మాణాలు, న్యాయపరమైన ఇబ్బందులు కూడా పోలవరం ఆలస్యానికి కారణమని ఐఐటీ బృందం చాలా స్పష్టం చెప్పింది.

పైగా పోలవరంపై పెట్టాల్సిన ఖర్చు తగ్గుతూ రావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది ఐఐటీ హైదరాబాద్. నిజానికి 2021 ఆగస్టు చివరి నాటికే ప్రాజెక్టు వ్యయం 18వేల కోట్లకు చేరుకుంది. కరోనా కారణంగా వ్యయం తగ్గిపోయింది. హెడ్‌వర్క్స్‌ విషయంలో తప్ప ఆయా కాంపొనెంట్లకు మంజూరుచేసిన మొత్తం కంటే వాస్తవ వ్యయం 50 శాతం కంటే తక్కువగా ఉందని, బడ్జెట్‌లో పెట్టిన మొత్తాన్ని ఖర్చు చేయలేకపోతోందని ఐఐటీ హైదరాబాద్ తెలిపింది.

Tags

Next Story