AP: బాలలను మింగిన ఇసుక గుంతలు

సెలవు రోజు మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కృష్ణా నదిలో ఇసుక గుంతలు ముగ్గురి బాలల జీవితాలను బలి తీసుకున్నాయి. సరదాగా గడిపేందుకు నదిలోకి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అంబులెన్స్ ఆలస్యంతో మృతదేహాలను బైక్‌లపైనే తరలించేందుకు కుటుంబసభ్యులు యత్నించగా పోలీసులు హడావుడిగా 108 వాహనాన్ని రప్పించారు. విజయవాడలోని పటమటకు చెందిన గగన్, తన స్నేహితులు ప్రశాంత్, కార్తీక్, షేక్ షారుఖ్‌లతో కలిసి సరదాగా గడిపేందుకు యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదికి వెళ్లారు. అక్కడ ఒడ్డున కొద్దిసేపు ఫొటోలు దిగారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రశాంత్, కార్తీక్, గగన్ నీటిలోకి దిగారు. సరిగా అక్కడే గుంత ఉండడంతో ఒక్కసారిగా అందులోకి కూరుకుపోయారు. ఈత రాకపోవడంతో సహాయం చేయాలని కేకలు వేయగా, ఒడ్డున ఉన్న షారూఖ్ వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో సమీపంలో ఉన్న జాలర్లకు విషయం చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని ముగ్గురినీ కర్రలతో లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి వల వేసి వెలికి తీసినా.. అప్పటికే వారు మరణించారు. విగతజీవులుగా మారిన బిడ్డలను చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
దుర్ఘటన గురించి తాడేపల్లి పోలీసులకు సాయంత్రం చెప్పగా వారు రాత్రి ఏడున్నరకు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారాన్ని పెనమలూరు పోలీసులకు చేరవేశారు. మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సులు సమకూర్చాలని కోరినా అరగంట వరకు రాలేదు. సాయంత్రం నుంచి మృతదేహాలతోనే ఉన్నామని, పోస్టుమార్టం కోసం తరలించేందుకు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారని మృతుల బంధువులు పోలీసులను నిలదీశారు. చివరికి మూడు ద్విచక్రవాహనాలపై మృతదేహాలను తీసుకుని కొత్త ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. యనమలకుదురు శివాలయం సమీపంలోకి రాగానే పోలీసులు వారిని ఆపి అంబులెన్సులు వస్తున్నాయని తెలిపారు. 45 నిమిషాలు ఎదురుచూసినా రాకపోవడంతో బంధువులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను తమ ఇళ్లకు తీసుకెళ్తామని కదులుతుండగా.. అంబులెన్సులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల కారణంగానే విద్యార్థులు నీట మునిగి మృత్యువాతపడ్డారని స్థానికులు ఆరోపించారు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో ఈత కోసం నీటిలోకి దిగిన విజయవాడకు చెందిన అయిదుగురు చనిపోయారని గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com