AP CM Chandrababu : రాజకీయం కోసమే ఇండియా కూటమి పోటీ.. చంద్రబాబు విమర్శలు

గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలిసినప్పటికీ, కేవలం రాజకీయాల కోసం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బరిలో నిలుపుతోందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశాయని, ఆయనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాధాకృష్ణన్ తనకు పాత మిత్రుడని, దేశం గౌరవించదగిన వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. ఆయన ఉపరాష్ట్రపతి పదవికే వన్నె తెస్తారని, అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ‘‘టీడీపీ ఎన్నికలకు ముందు నుంచే ఎన్డీయేలో ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో మేం ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం. అలాంటప్పుడు ప్రతిపక్షాలు మా నుంచి మద్దతు ఆశించడం సరికాదు’’ అని చంద్రబాబు తెలిపారు.
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అనే అంశంపై మాట్లాడుతూ.. గెలిచే అవకాశం ఉన్నప్పుడే అభ్యర్థిని నిలబెట్టాలని అభిప్రాయపడ్డారు. గతంలో పీవీ నరసింహారావు విషయంలో తెలుగు వ్యక్తి అనే భావనతో కాంగ్రెస్‌లో లేకపోయినా టీడీపీ మద్దతిచ్చిందని, కానీ ప్రస్తుత పరిస్థితులు వేరని ఆయన వివరించారు. కూటమి ధర్మానికి కట్టుబడి ఎన్డీయే అభ్యర్థికే తమ ఓటు ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com