AP CM : మహిళలను అవమానించడం వైసీపీ డీఎన్ఏలోనే ఉంది : సీఎం చంద్రబాబు

కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదని, మహిళలను బూతులు తిట్టడం, కించపరచడం వారి రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు కారణమని తెలిసినా వారి గుణంలో మార్పు రావడం లేదని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తోన్న నేతలు అంతే అసహ్యంగా మాట్లాడుతున్నారు" అని సీఎం పేర్కొన్నారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ నేతలు మనుషులేనా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com