వైసీపీలో ఆగని వర్గపోరు

వైసీపీలో వర్గపోరు అనేది కామన్ గా మారిపోయింది. క్రమశిక్షణ లేకుండా ఎవరికి వారు తామే లీడర్లమని చెలరేగిపోతున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో పాటు బాహాబాహాకి దిగుతున్నారు. గన్నవరం వైసీపీలో వర్గపోరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా యార్లగడ్డ, వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తడం కామన్ అయిపోయింది. తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీలోనూ ఇరు వర్గాల నేతలు, కార్యకర్తల మధ్య తోపులాటకు దిగారు.
తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కింది.ఆధిపత్య పోరుకు పట్టాల పంపిణీ వేదికైంది. వైసీపీ ఇంఛార్జి అమ్మాజీ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి సమక్షంలో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవతో అసహనం వ్యక్తం చేస్తూ... మంత్రి, కలెక్టర్ వేదిక మీద నుంచి దిగిపోయారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి గుర్తింపు లేదని నేతలు ఆందోళనకు దిగారు.
ఇక కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రక్షణనిధిని వైసీపీ కార్యకర్తలతో పాటు స్థానికులు అడ్డుకున్నారు. అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో మీరెవరని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేయడంతో.. తాము ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అయ్యారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com