TELANGANA: బాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ

TELANGANA: బాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ
హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ... చంద్రబాబును విడుదల చేయాలంటూ నినాదాలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగన్ సర్కార్ కుట్రపూరితంగానే చంద్రబాబును అరెస్టు చేసిందని ఆరోపిస్తూ ప్రజలు మండిపడుతున్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా సుమారు 10 వేల కార్లతో నేడు, రేపు ర్యాలీ చేయాలని ఐటీ ఉద్యోగుల నిర్ణయించారు. నానక్‌రామ్‌గూడ టోల్‌గేట్‌ నుంచి కార్ల ర్యాలీ ప్రారంభించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు.

ఉద్యోగుల ఆందోళనతో ఓఆర్‌ఆర్‌పై పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టోల్‌గేట్ వద్ద కార్ల తనిఖీలు నిర్వహించారు. కార్ల ర్యాలీకి అనుమతి లేదంటూ హైదరాబాద్‌-ముంబయి మార్గంలో ఎగ్జిట్‌ 3 వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని కార్లను ఎగ్జిట్‌ 3 నుంచి బయటకు పంపేందుకు యత్నించారు. శాంతియుత ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని ఐటీ ఉద్యోగుల వాగ్వాదానికి దిగారు.


హైదరాబాద్ కూకట్ పల్లిలోని ప్రగతినగర్ లో చంద్రబాబు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. మిథిలానగర్ నుంచి అంబీర్ చెరువు వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నందమూరి చైతన్య కృష్ణ ర్యాలీలో పాల్గొని.... నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన అంతం కావాలని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంగా బయటికి వచ్చి, మళ్లీ అధికారం చేపట్టాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు.

ఖమ్మంలోనూ నిరసనలు కోనసాగుతున్నాయి. NTRభవన్ ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ వారు చేశారు. చంద్రబాబు బెయిల్ పై బయటికి క్షేమంగా రావాలని ఆకాంక్షిస్తూ హనుమకొండ జిల్లా పరకాలలో శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో తెలుగుదేశం నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


సూర్యాపేట జిల్లా కోదాడలో అఖిలపక్షం నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ లో బాబు అభిమాన సంఘాలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సుమారు ఐదు వందల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ సీఎంనీ అరెస్ట్ చేయడం కుట్రపూరితమేనని ఆరోపించారు.

Tags

Next Story