AP : జగన్, చంద్రబాబు డైలాగ్ వార్..ఏపీలో మళ్లీ పొలిటికల్ బీపీ
వైసీపీ అధినేత జగన్‌ను తిరుమలకు వెళ్ల వద్దని ఎవరూ చెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామన్నారు. తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణలు ఖండించారు. నోటీసులు ఇచ్చారనీ, నిలుపుదల చేశారని ఆరోపిస్తున్నారనీ... జగన్‌కు పోలీసులు ఏమైనా నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్‌ను వెళ్లొద్దని నోటీసులు ఇస్తే.. మీడియాకు చూపించాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీటీడీలో జరిగిన పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయనీ.. తిరుమలకు వెళ్లాలంటే అక్కడ ఆచారాలు, నియమాలు పాటించాల్సిందేనన్నారు. తిరుమలలో నెయ్యి కల్తీ జరగలేదని జగన్ ఎలా చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస పాలన నడుస్తోందన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తిరుమల శ్రీవారి ప్రసాద విశిష్టతను రాజకీయ దుర్బుద్ధితో దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వంద రోజుల పాలన డైవర్ట్ చేయడానికే లడ్డూ అంశం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలకు ఆధారాలు నిరూపిస్తామని జగన్ హెచ్చరించారు. క్వాలిఫై అయిన వారికే టెండర్లు దక్కుతాయని .. టెస్ట్లు పాసైతేనే నెయ్యి తీసుకుంటారన్నారు. నెయ్యి టెండర్ల అంశం టీటీడీ బోర్డుకే కానీ ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ గురించి మాట్లాడారన్నారు. మానవత్వం నా మతం అని జగన్ వ్యాఖ్యానించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com