AP: 7 నెలల తర్వాత నేడు అసెంబ్లీకి జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్... నేడు అసెంబ్లీకి రావడానికి సిద్ధమయ్యారు. సోమవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ సమయానికి సభకు హాజరు కావాలని వైసీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం 9గంటలకు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి రావాలని అధిష్ఠానం సూచించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ అక్కడి నుంచి అసెంబ్లీకి వస్తారు. ఆయన చివరిసారి గతేడాది జులైలో అసెంబ్లీ సమావేశాలప్పుడు రెండు రోజులు వచ్చారు. తర్వాత నవంబరులో జరిగిన సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం తర్వాతి రోజు నుంచి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. జగన్ రాకుండా ఎమ్మెల్యేలను మాత్రం సభకు పంపవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతిపక్ష హోదా కావలంటూ..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లూ భీష్మించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎట్టకేలకు మెట్టు దిగారు. సోమవారం నుంచి మొదలవుతున్న 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలకు తన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరవుతున్నారు. అయితే సమావేశాలకు హాజరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు అందరికీ ప్రోటోకాల్ ప్రకారం వారికి కేటాయించిన గేట్ల నుంచి లోపలకు వచ్చే అవకాశం ఉంటుంది
జగన్ క్షమాపణ చెప్పాల్సిందే
ఏపీ అసెంబ్లీకి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన తప్పులకు జగన్ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలి..ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరిస్తామని మాటిచ్చారు. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 మంది అసెంబ్లీ సభ్యులు ఉండాలని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కేవలం 11 స్థానాలు ఇచ్చి...ప్రతి పక్ష హోదా ఇవ్వలేదని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com