AP: ఆత్మరక్షణలో జగన్

జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదం వైఎస్ కుటుంబంలోనే కాకుండా.. ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వివాదంతో జగన్ల ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలతో షర్మిల ఉక్కిరిబిక్కిరి చేస్తుండటం.. తల్లి విజయమ్మ కూడా షర్మిలకు వత్తాసు పలుకుతూ జగన్ చేసింది అన్యాయమనేలా ప్రకటన విడుదల చేయడం.. వైసీపీ అధినేతకు మింగుడుపడటం లేదు. షర్మిల, విజయమ్మ ప్రకటనలు ఏపీలోని పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయనే ఆందోళనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల జగన్ మధ్య సాగినల వైఎస్ కుటుంబ ఆస్తులు గొడవ విజయమ్మ బహిరంగ లేఖతో ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటివరకూ షర్మిలపై ఏదో ఒక స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇది ఒక అన్న చెల్లెళ్ల మధ్య గొడవగానే ఉండిపోతుందనుకున్నవారికి తల్లి విజయమ్మ అనూహ్యంగా బహిరంగ లేఖ రాయడం జగన్‌కు, వైసీపీ నేతలకు మింగుడు పడట్లేదు. ఈ అంశంపై తమకు తాముగా నోరెత్తలేని పరిస్థితి ఎదురైంది. ఇక వాట్ నెక్స్ట్ అంటూ వైసీపీలో అంతర్గత చర్చ బలంగా సాగుతోంది.
విజయమ్మ లేఖతో కలకలం
వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తుంటే బాధగా ఉందన్న వైఎస్ విజయమ్మ.. తమ కుటుంబానికి దిష్టి తగిలిందన్నారు. జరగకూడనివన్నీ తన కళ్ల ముందే జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారన్న వైఎస్ విజయమ్మ.. ఇది ఎవరికీ మంచిది కాదన్నారు.
వివాదం కొనసాగితే వైసీపీకి ఇబ్బందే
ఆస్తుల వివాదాలు పరిష్కరించుకోవడం జగన్‌కు అంత తేలిక కాదు. ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఎవరో ఒకర అసంతృప్తికి గురి కావడం తప్పనిసరి. వైఎస్ ఫ్యామిలీలో పొలిటికల్ ఇమేజ్ కూడా ఓ ఆస్తి లాంటిదే. అది కూడా ఇప్పుడు ఈ వివాదంలో కీలకంగా మారింది. ఎంత త్వరగా పరిష్కారమైతే ఆ ఆస్తి అంతగా ఉంటుంది. లేకపోతే అది కూడా కరిగిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com