Sharmila : ఆస్తి గొడవలు సామాన్యమేనన్న జగన్.. కాదు సార్ అంటూ షర్మిల కౌంటర్

తల్లి విజయమ్మ, చెల్లె షర్మిలతో కొనసాగుతున్న ఆస్తి వివాదంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఆస్తి గొడవలు అన్ని ఇళ్లలో ఉండేవే అన్నారు. ప్రతి ఇంట్లో జరిగే గొడవే మా ఇంట్లో జరుగుతుందని చెప్పారు జగన్. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇంట్లో గొడవల విషయాలు ఆపేసి.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు.
అన్న జగన్‌కు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. తన మీద ప్రేమతో, చట్ట విరుద్ధమని తెలిసినా షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు తాము కుట్రపన్నాం అనేది ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌గా షర్మిల అభివర్ణించారు. నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారన్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులను లాక్కునేందుకు.. ఈడీ కేసులని, తన బెయిల్ రద్దవుతుందని ఏవేవో కారణాలు చెబుతున్నారన్నారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదనీ.. కేవలం రూ.32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే అటాచ్ చేసినట్లు స్పష్టం చేశారు. 2016లో ఈడీ అటాచ్ చేసినందు వల్ల షేర్ల బదిలీ చేయకూడదని జగన్‌మోహన్ రెడ్డి వాదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com