YSR: వైఎస్ జయంతి వేదికగా జగన్-షర్మిల వారసత్వ పోరు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతి నేడు. వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. వైసీపీ అధినేత జగన్ శనివారమే పులివెందులకు చేరుకోగా.. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల నిన్న రాత్రి ఇడుపులపాయకు చేరుకుని బస చేశారు. తొలుత జగన్ నివాళులర్పించి వెళ్లిన తర్వాత షర్మిల హాజరుకానున్నారు.
వారసత్వ పోరు
ఈ జయంతి వేడుకలు ఈసారి రాజన్న బిడ్డల మధ్య రాజకీయ వారసత్వం ఎవరిదన్న దానిపై ఆదిపత్య పోరులా మారాయి. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసినా రాజన్న బిడ్డల మధ్య పోరు మాత్రం ఆగడం లేదు. 2024లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా జగన్ ఘోర పరాజయంలో తన వంతు పాత్రను షర్మిల సమర్థంగా పోషించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న జగన్‌ను మరో దెబ్బ కొట్టేందుకు షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. YSR వారసత్వంపై అన్నా చెల్లెల్ల మధ్య రాజకీయ రచ్చ పతాక స్థాయికి చేరుతోంది. ఇప్పటివరకూ షర్మిల, జగన్ ఇడుపుల పాయ వెళ్లి తండ్రికి అంజలి ఘటించేవారు. అయితే ఈసారి వైఎస్ జయంతిని షర్మిల వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నారు.
YSRCP పార్టీకి వైఎస్‌ను దూరం చేసి... కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేలా షర్మిల వ్యూహ రచన చేస్తున్నారు. ఇవాళ విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను షర్మిల ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఈ నెల 8న YSR జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఇటు షర్మిల... అటు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా వైఎస్ వారసత్వం ద్వారా వచ్చిన ఓటు బ్యాంకుతో జగన్ రాజకీయంగా లాభం పొందారు. కానీ ఇప్పుడు షర్మిల రూపంలో జగన్ గట్టి పోటీ ఎదురు అవుతోంది. ఇవాళ విజయవాడలో నిర్వహించి YSR జయంతి వేడుకలకు పలు రాష్ట్రాల ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. వైఎస్ జయంతికి హాజరు కావాలని ఇప్పటికే షర్మిల... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రేవంత్ రెడ్డితోపాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా ఈ వేడుకలకు ఆహ్వానించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను కూడాషర్మిల కోరారు. షర్మిల బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్‌కు ఏపీలో ఆశలు చిగురించాయి. ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికలకు పార్టీని ఇప్పటినుంచే షర్మిల సిద్ధం చేస్తోంది. అందుకు వైఎస్‌ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com