YS Jagan : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం డాక్యుమెంట్లపై తీవ్ర విమర్శలు

YS Jagan : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా తీసుకొచ్చిన డాక్యుమెంట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాల కవర్‌పేజీపై జగన్ ఫొటోతో పాటు గృహ నిర్మాణ శాఖ లోగోను ముద్రించారు. కవర్‌పేజీని నీలం, ఆకుపచ్చ రంగులతో ముద్రించారు. రిజిస్ట్రేషన్ చేయించటానికి తీసుకున్న స్టాంపు పేపర్, స్థల హద్దులను తెలిపే బాండ్ పేపర్లపై కూడా జగన్ ఫొటో పెట్టారు. ప్రతి పేజీ అడుగు భాగంలోనూ జగన్ ఫొటోనే ముద్రించారు.
వీటితో పాటు హక్కుపత్రాలతో పాటు అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, కుటుంబసభ్యులందరికీ నిండు మనసుతో రాస్తున్న ఉత్తరమిది అంటూ జగన్ రాసిన రెండు పేజీల లేఖను జత చేశారు. పథకం లక్ష్యం, రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందనే వివరాలను లేఖలో ప్రస్తావించారు. ఆఖరి పేజీపైనా జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలు ముద్రించారు. కవర్ పేజీ ఎలా ఉందో.. అచ్చం అలాగే దీన్ని కూడా నీలం, ఆకుపచ్చ రంగులతో రూపొందించారు. చూస్తుంటే.. ఇదేదో వైసీపీ పాంప్లేట్‌లా ఉందంటూ జనం విమర్శలు చేస్తున్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల నమూనా రిజిస్ట్రేషన్ పత్రాలను గృహనిర్మాణ శాఖ 7 పేజీలతో రూపొందించింది. రిజిస్ట్రేషన్ వివరాలు, ఆస్తి సరిహద్దులు, ఇతర వివరాలను అందులో పొందుపరిచింది. పేదలకు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల పట్టాలను పొందిన లబ్ధిదారులకు యాజమాన్య హక్కు కల్పించేలా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తరఫున ఆయా మండలాల తహసీల్దార్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అయితే, ఈ పథకం కింద రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు అందకపోవటంతో తహసీల్దార్లలో గందరగోళం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com