Jagananna Illa Pattalu: జగనన్న ఇళ్ల పట్టాల పథకంలో గోల్‌మాల్.. నిస్సహాయ స్థితిలో ప్రజలు..

Jagananna Illa Pattalu: ఏపీలో పేదల ఇళ్ల పట్టాల పథకం పెద్దల దోపిడీ పథకంగా మారిపోయింది. ఇళ్ల పట్టాల కోసం ప్రైవేటు భూముల కొనుగోలులో నేతలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన నేతలు.. అందులో భారీగా కమీషన్లు కొట్టేశారని పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇళ్ల పట్టాల పేరుతో నివాసయోగ్యం కాని భూములను కొనుగోలు చేసే క్రమంలో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారని విపక్షాలు బహిరంగంగానే ఆరోపించాయి.
అయితే తాజాగా ఇళ్ల పట్టాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో మెరక పనుల పేరుతో నేతలు మరో దోపిడీకి తెరలేపారు. నేతల దోపిడీకి అధికారులు తమ వంతు సహాకారం అందిస్తుండడంతో మెరక పనుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 40 లక్షలకు కొన్న భూమికి మెరక పనులు చేసేందుకు 44 లక్షలు ఖర్చవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇళ్ల పట్టాల మెరక పనులకు రికార్డు స్ధాయిలో అంచనాలు రూపొందించిన అధికారులు.. ఆ మేరకు ఉపాధి హామీ నిధులను విడుదల చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 7 వేల 68 ఎకరాలకు మెరక పనుల నిమిత్తం 970 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించగా.. ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోని 559 ఎకరాలకు మెరక పనుల కోసం 161 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు.
మచిలీపట్నంలోని కొన్ని గ్రామాలలో మెరక పనుల కోసం అధికారులు వేసిన ఈ అంచనాలను పరిశీలిస్తే.. ఒక్కో ఎకరానికి మెరక పనులు చేయాలంటే 44 లక్షలకు పైగా వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 44 లక్షలకు పైగా మెరక పనుల వ్యయం అవుతుందని అంచనా వేసిన గ్రామాలలో భూమిని 40 లక్షలలోపు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేసింది.
అంటే భూమి కొనుగోలు ధర కంటే ఎక్కువ మొత్తం మెరక పనుల నిమిత్తం ఖర్చుచేయాలని అధికారులు అంచనాలు రూపొందించడం, పైగా ఆ నిధులు విడుదల చేయడం అందరిననీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మచిలీపట్నం నియోజకవర్గంలోని 33 పంచాయతీల్లో 559 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల పట్టాలుగా పంచాలని నిర్ణయించారు. 559 ఎకరాలకు మెరక పనులకు 161 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.
అయితే నియోజకవర్గంలోని చినకరగ్రహారం, కరగ్రహారం పంచాయతీల పరధిలో 323 ఎకరాల మెరక పనుల కోసం 118 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. కరగ్రహారం, చినకరగ్రహారంలో పేదల పట్టాల కోసం ప్రైవేటు భూములను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో ఎకరం భూమి 40 లక్షలకు కొనుగోలు చేయగా, కొనుగోలు చేసిన భూముల్లో మెరక పనులు చేసేందుకు 44 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు.
ఈ మేరకు అధికారులు రూపొందించిన అంచనాలకు ఉపాధి హామీ నిధులను వినియోగించాలని నిర్ణయించారు. అధికారులు రూపొందించిన అంచనాలను పరిశీలిస్తే చినకరగ్రహారం పంచాయతీలోని 118 ఎకరాలను 13 లేఔట్లుగా విభజించారు. 10 ఎకరాల చొప్పున 11 లేఔట్లు, 7 ఎకరాల భూమిలో ఒక లే ఔటు, 1.5 ఎకరాల భూమిలో మరో లేఔటు చొప్పున 118 ఎకరాలను విభజించారు. అందులో అత్యధికంగా 10 ఎకరాల లేఔట్‌లో మెరక పనుల కోసం 4 కోట్ల 30 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. అంటే ఒక్కో ఎకరానికి మెరక పనులకే 43 లక్షలు ఖర్చవుతుందని అర్ధమవుతుంది.
ఇక కరగ్రహారం పంచాయతీలోని 205 ఎకరాల భూమిలో మెరక పనుల కోసం 77 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కరగ్రహారంలోని 205 ఎకరాలను 24 ప్యాకేజీలుగా విభజించి లే ఔట్లు రూపొందించారు. ఇక్కడ కూడా 10 ఎకరాల లేఔట్‌కు గరిష్టంగా 4 కోట్ల 41 లక్షల రూపాయలు మెరక పనులకు వ్యయమవుతుందని అంచనాలు వేశారు. అంటే ఒక్కో ఎకరానికి మెరక పనుల కోసం 44 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు.
భూమి ఖరీదే 40 లక్షల లోపు ఉన్నప్పుడు మెరక పనులకు 44 లక్షలు ఖర్చవుతుందని అంచనాలు వేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మెరక పనులకే ఎకరానికి 44 లక్షలు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారంటే, అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చవుతుందో అంతుచిక్కడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఇక మచిలీపట్నంలో నియోజకవర్గంలోని ఇళ్ల పట్టాల మెరక కోసం 144 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు.. ఆ మొత్తాన్ని ఉపాధి హామీ పథకం నుంచి డ్రా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉపాది హామీ పథకం నుంచి మచిలీపట్నంలోని ఇళ్ల పట్టాల మెరక కోసం 12 కోట్ల రూపాయల నిధులను డ్రా చేశారు. అంటే 12 కోట్ల రూపాయల మట్టి లేదా గ్రావెల్‌ను ఇళ్ల పట్టాల కోసం తరలించారని అర్ధమవుతుంది.
ఈ మట్టిని ఎక్కడ నుంచి తీసుకువచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. మట్టి గాని, గ్రావెల్ గాని తవ్వి తరలించాలంటే అందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇళ్ల పట్టాల మెరక పనుల నిమిత్తం మట్టి, గ్రావెల్ తవ్వకాలకు సంబంధిత శాఖల అనుమతి తీసుకోలేదని టీవీ5 పరిశోదనలో తేలింది.
రాజకీయ నేతల ఒత్తిడితో అక్రమ తవ్వకాలు జరిపి.. తరలించిన దానికంటే ఎక్కవ మొత్తంలో తరలించామని తప్పుడు లెక్కలతో ఎం.బుక్‌లు తయారు చేసి, ఆ మేరకు అధికారులు ఉపాధి హామీ నిధులను డ్రా చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన పనుల్లో మెరక పనులు లేవని తేల్చి చెప్పింది. మెరక పనుల కోసం డ్రా చేసిన ఉపాధి హామీ నిధులను సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేసి జమ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఉపాధి హామీ పథకం నిధులను డ్రా చేసిన అధికారులు ఇప్పుడు బెంబేలెత్తుతున్నారు. నేతల మాటలు విని అడ్డగోలు అంచనాలు రూపొందించి నిధులు డ్రా చేసిన ఫలితం అనుభవించాల్సిన పరిస్ధితి ఏర్పడిందని అధికారులు వాపోతున్నారు. మరోవైపు మెరక పనుల నిమిత్తం డ్రా చేసిన ఉపాధి హామీ పనుల నిధులను బడానేతలు బినామి పేర్లతో దారిమళ్లించినట్లు తెలుస్తోంది.
బడానేతల ఆదేశాలతో మట్టి పనులు చేసిన కింది స్ధాయి నేతలు.. ఆ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం తాజా ఆదేశాల కారణంగా తమ బిల్లుల పరిస్ధితి ఏంటో కిందిస్ధాయి నేతలకు అర్ధం కావడంలేదు. అటు అధికారులతోపాటు ఇటు కిందిస్ధాయి నేతలను ఏకకాలంలో దెబ్బకొట్టిన బడానేతలు.. తాజా పరిస్ధితులపై మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఈ గండం ఎలా గట్టెక్కాలో అర్ధంకాని అయోమయస్ధితిలో చిక్కుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com