PAWAN: వైసీపీ ఓటమి ఖాయం

వైసీపీ ప్రభుత్వంలో ప్రజల భూములకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పిఠాపురంలోని చిత్రాడలో మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని పవన్ రోడ్ షో చేపట్టారు. పవన్ కు పిఠాపురం తెలుగుదేశం ఇంఛార్జ్ వర్మ, భాజపా ఇంఛార్జ్ రాజు, ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఘనస్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న పవన్ కూటమి గెలవబోతోందని జోస్యం చెప్పారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో భూహక్కు చట్టం రద్దు చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు.
డైరెక్టర్ సుజీత్ ప్రచారం
పవన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో స్టార్ సెలబ్రిటీలు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. తాజాగా బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, అలాగే ఓజీ డైరెక్టర్ సుజిత్ పిఠాపురంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ గాజు గ్లాసుకు ఓటువేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు. వీరికి తోడుగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా బ్రదర్ నాగ బాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, తేజ సజ్జా, రాజ్ తరుణ్, సంపూర్ణేష్ బాబు, రామజోగయ్య శాస్త్రి తదితరులు పవన్ కు మద్దతు పలికారు. ఆయన భారీ మెజారిటీతో గెలవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.
పవన్ సభకు నో పర్మిషన్
కాకినాడ సిటీలో పర్యటన, రోడ్ షో అనుమతి కోసం అధికారులకు పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అయినా ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి రాకపోవడం గమనార్హం. అనుమతి కోసం 48 గంటలుగా అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. గురువారం నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన నేతలు పడిగాపులు కాస్తున్నారు. శనివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో కాకినాడలో పవన్ రోడ్ షో, సభకు టీడీపీ, జనసేన దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు సాకులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com