PAWAN: వైసీపీ ప్రభుత్వం తుడిపెట్టుకుపోవాలి

రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజల అవసరాలపై లేవని మండిపడ్డారు. వ్యక్తిగత ఆశలను పక్కన పెట్టి..ప్రజాకాంక్ష కోసమే పొత్తు పెట్టుకున్నామన్న పవన్..జగన్ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు తొందరలోనే వస్తాయని హెచ్చరించారు. బూతులు తిట్టి, ప్రజలపై దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్ లో ఉన్నారని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పేవారు మాత్రం ఒక్కరూ లేరని విమర్శించారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలన్న పవన్ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు.
జగన్ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పైకి వెళ్లిందన్న ఆయన అధికారం ఇస్తే NDA కూటమి ఆక్సిజన్ గా పనిచేస్తుందని సూచించారు. దగాపడిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు కలిసి రావాలని కోరారు. 30 రోజులపాటు ప్రజలు రాష్ట్రం కోసం పనిచేస్తే... ఐదేళ్లపాటు వారి కోసం తాము పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తణుకులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంయుక్తంగా రోడ్ షో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలను ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం సహా మెగా డిఎస్సీ వేస్తామని ప్రకటించారు.
గత ఐదేళ్లలో జగన్ సర్కారు సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమిగా ఏర్పడినట్లు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల చేతుల్లోనే ఉందన్న చంద్రబాబు ఎలాంటి పాలన కావాలో నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజలు నెలరోజులు రాష్ట్రం కోసం పనిచేస్తే....... తాము ఐదేళ్లు వారి కోసం పనిచేస్తామని చంద్రబాబు వివరించారు. స్థానిక MLA, మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా దోచుకున్నారని ఆరోపించారు. సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులకుని.. ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కల్యాణ్ అని చంద్రబాబు అభినందించారు.PAWAN: వైసీపీ ప్రభుత్వం తుడిపెట్టుకుపోవాలి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com