PAWAN: జీతం వద్దని చెప్పా: పవన్‌ కల్యాణ్‌

PAWAN: జీతం వద్దని చెప్పా: పవన్‌ కల్యాణ్‌
X
పనిచేసి మన్ననలు పొందాకే ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటా... జనసేనాని కీలక వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వ అరాచకాలను సరిదిద్ది ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకువెళ్లగలిగే అనుభవం చంద్రబాబుకు ఉందని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. వలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ జరగదని గత వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసినా .. దానిని పటాపంచలు చేసి పింఛన్లు పంపిణీ చేశామని పవన్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని... అధికార వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి వ్యవస్థలను బాగుచేసే పనిలో ఉన్నామని, తమది కరెక్షన్‌ ప్రభుత్వమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తొలిసారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ సభలో ప్రసంగించారు. తెలిపారు. పిఠాపురంలో స్థలం కోసం చూస్తున్నానని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారు.


పౌరసరఫరాల శాఖలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలు గమనించాలని పవన్‌ సూచించారు. ప్రజల బియ్యాన్ని గోడౌన్‌లో ఎలా దాచారో అంతా చూడాలన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తన క్యాంప్‌ ఆఫీసుకు మరమ్మతులు చేయించాలని అధికారులు చెప్పారని తానే వద్దన్నానని పవన్‌ తెలిపారు. తన కొత్త ఫర్నిచర్‌ తానే తెచ్చుకుంటానని అధికారులకు తెలిపినట్లు చెప్పారు. ఇటీవల అసెంబ్లీకి వెళ్లినందుకు జీతం వస్తుందని అధికారులు చెబితే... ఇన్ని అప్పులు కనిపిస్తుంటే...తీసుకోవడానికి మనసు అంగీకరించలేదని... వదిలేసుకుంటున్నానని చెప్పానని వెల్లడించారు. తనను పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పవన్‌ అన్నారు. ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలచుకోలేదు.. తక్కువ చెప్పి, ఎక్కువ చేయాలని అనుకుంటున్నానని అన్నారు.

ఇప్పుడిక హామీలు నెరవేర్చడమే మన ముందున్న సవాలని.... గెలిచిన వెంటనే విజయయాత్ర చేస్తే తృప్తి, ఆనందం ఉండదన్నారు. పనిచేసి మీ మన్ననలు పొందాకే ఆనందం వస్తుంది. అప్పుడే నాకు నేను పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటానని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, తెదేపా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ తదితరులు పాల్గొన్నారు. కొల్లేరు ఉన్న కైకలూరు నియోజకవర్గంలో 80 శాతం చేపల చెరువులు ఉన్నా తాగడానికి నీళ్లు లేవన్నారు. గోదావరి జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖను నడిపే వ్యక్తిగా చెబుతున్నా.. తన వైపు నుంచి అవినీతి ఉండదని మాటిస్తున్నానని... ఎన్నికల్లో 21కి 21 ఎలా కొట్టామో రక్షిత మంచినీరు లేని గ్రామం లేదని అనిపించుకోవాలన్నది తన కోరిక అని వెల్లడించారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. అరకులో గర్భిణులను డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి పోవాలని పవన్‌ సూచించారు.

Tags

Next Story