PAWAN: వెంకన్నకు కల్తీప్రసాదం పెట్టారు

PAWAN: వెంకన్నకు కల్తీప్రసాదం పెట్టారు
X
వైసీపీని ఒకే సీటుకు పరిమితం చేస్తా... తిరుపతి వారాహి సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వైసీపీపై విరుచుకుపడ్డారు. తిరుపతిలో వారాహి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 'నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా స్పందించలేదు. కానీ కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అపచారం జరిగితే స్పందించకుండా ఉంటామా. అన్నీ రాజకీయాల కోసమే చేయలేం. నాకు అన్యాయం జరిగిందని బయటకు రాలేదు. ఇది భగవంతుడికి సంబంధించిన విషయం. వెంకన్నకు కల్తీప్రసాదం పెట్టారు' అని పేర్కొన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ తిరుపతిలోని వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కావడంతో వారాహి సభలో పవన్ పాల్గొని మట్లాడారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సభను నిర్వహించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఉండాలని జనసేన డిమాండ్ చేస్తోందన్నారు.

కోర్టులపై సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. సనాతన ధరాన్మి దూషించే వారికే కోర్టులు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని పాటించేవారిపై నిర్ధాక్షిణ్యంగా ఉంటే, అన్య ధర్మాలను పాటించేవారిపై మానవత్వం చూపిస్తాయని అన్నారు. అయిన వాళ్లకు ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వైసీపీని ఒకే సీటుకు పరిమితం చేస్తా

పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా బుద్ధిరాలేదని, ఈసారి ఎన్నికలు పెట్టమనండి ఒకే సీటుకు పరిమితం చేస్తానని సవాల్ విసిరారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని వ్యాఖ్యానించిన ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ కల్యాణ్ పరోక్షంగా ధ్వజమెత్తారు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని పవన్ తెలిపారు.

జనసేన విస్తరణకు పవన్ వ్యూహాలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీని విస్తరించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నట్లు తెలిసిపోతుంది. శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంతో పవన్ ఆవేశం అంతా జగన్ మీదనో.. కల్తి నెయ్యి వివాదం మీదో అని భావించారు. కానీ ఆయన తన పార్టీని విస్తృతపరిచే దిశగా అడుగులు వేస్తున్న సంగతి స్పష్టమైంది. ఫక్తు ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే తమిళనాడులో ఆల్టర్నేటివ్ పొలిటికల్ థాట్‌ను బిల్డ్ చేసే పనిలో పవన్ ఉన్నట్టు తెలిసిపోతుంది.

Tags

Next Story